అంతరపంటలతో అధిక లాభాలు
● ఆయిల్‌పామ్‌లో మునగ సాగు భేష్ ● జిల్లా ఉద్యాన అధికారి కిషోర్
అశ్వారావుపేటరూరల్ : ఆయిల్‌పామ్ తోటల్లో అంతర్ పంటగా మునగ సాగు చేసి అధిక లాభాలు గడించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జంగా కిషోర్ సూచించారు. అశ్వారావుపేటలోని కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం, నర్సరీతోపాటు పాల్వంచలో శనివారం ఆయన పర్యటించి రైతులు సాగు చేస్తున్న మునగ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పామాయిల్ తోటల్లో తొలి రెండేళ్ల లోపు అంతర్ పంటగా మునగ సాగు చేస్తే మూడేళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. మునగ పంటతో వచ్చే ఆదాయంతో పాటు తోట యాజమాన్యం నిమిత్తం తమ శాఖ నుంచి ఎకరానికి రూ.2,100 అందిస్తామని చెప్పారు. ఈజీఎస్ జాబ్ కార్డు ఉన్న రైతులకు వంద శాతం సబ్సిడీపై మునగ మొక్కలు పంపిణీ చేస్తామని, మెటీరియల్ కాంపొనెంట్ కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు. ఆసక్తి గల రైతులు ఉద్యాన, ఉపాధి హామీ అధికారులను లేదా ఎంపీడీఓ, ఏఓను సంప్రదించాలని సూచించారు.
ఆశాజనకంగా ఆయిల్‌పామ్ ధర..
ఆయిల్‌పామ్ టన్ను ధర రైతులకు ఆశాజనకంగా మారుతోంది. ధర క్రమంగా పెరుగుతుండగా.. శనివారం ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారుల సమావేశంలో టన్ను ధర మరో రూ.384 పెంచుతూ నిర్ణయించామని ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. గత నెల టన్ను ధర రూ.20,487 ఉండగా, తాజా పెంపుతో రూ.20,871కి చేరింది. ఈ సీజన్‌లో అధికంగా ధర పెరగడం ఇదే తొలిసారి. కాగా, ధర పెంపుతో కొత్తగా పామాయిల్ సాగుకు రైతులు ముందుకొచ్చే అవకాశం ఉందని జీఎం చెప్పారు. తోటల సాగుకు కొత్త రైతులు ముందుకొస్తే నాణ్యమైన మొక్కలు అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment