విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
భద్రాచలంటౌన్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెనూ ప్రకారం భోజనం సమకూరుస్తూనే వ్యక్తిగత ఆరోగ్యంపైనా శ్రద్ధ వహించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఉద్యోగులకు సూచించారు. ఉమ్మడి జిల్లాలోని గిరిజన పాఠశాలల హెచ్‌ఎంలు, వార్డెన్లు, ఏఎన్‌ఎంలకు భద్రాచలం బీఈడీ కళాశాలలో శనివారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎన్‌ఎంలు అప్రమత్తంగా ఉంటూ పిల్లల ఆరోగ్యాన్ని గమనించాలని, ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ప్రత్యేక గది ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయించాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతపై సమీప పీహెచ్‌సీల వైద్యులతో నెలకోసారి అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. కిశోర బాలికలకు మహిళా వైద్యులతో అవసరమైన కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు. అన్ని పాఠశాలలకు త్వరలోనే మెడికల్ కిట్లు అందిస్తామని పీఓ వెల్లడించారు.
ఎస్సెస్సీలో వంద శాతం ఫలితాలే లక్ష్యం..
పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యాన వెనకబడిన విద్యార్థులకు రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, హెచ్‌ఎంలు, వార్డెన్లు, సబ్జెక్ట్ టీచర్లు పాఠశాలల్లోనే రాత్రి బస చేయాలని పీఓ రాహుల్ ఆదేశించారు. ప్రీ ఫైనల్ పరీక్షల జవాబు పత్రాలు దిద్దే సమయాన విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి మరింత మెరుగపడేలా సూచనలు చేయాలని తెలిపారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూనే ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీలు మణెమ్మ, విజయలక్ష్మి, ఏసీఎంఓ రమణయ్య, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరూనాయక్, హెల్త్ కమాండ్ సెంటర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చైతన్య, ఏటీడీఓలు అశోక్ కుమార్, జహీరుద్దీన్, చంద్రమోహన్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు ఐటీడీఏ పీఓ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment