సీతారామ కాలువలో పడి వ్యక్తి మృతి
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన తాళ్లూర వెంకటేష్ (30) గుంపెన సమీపంలోని సీతారామ కాలువలో పడి శనివారం మృతి చెందాడు. వెంకటేష్ స్నేహితులతో కలిసి సరదాగా చేపలు పట్టేందుకు సీతారామ కాలువ వద్దకు వెళ్లాడు. వల విసిరే క్రమంలో కాలు జారి కాలువలో పడిపోయాడు. స్నేహితులు వెలికితీసి ఎర్రగుంట పీహెచ్‌సీ తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు.
అనుమానాస్పదస్థితిలో యువకుడు..
చండ్రుగొండ : మండలంలోని మంగయ్యబంజర్ గ్రామానికి చెందిన నక్కా మనోహర్ (22) శనివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాత్రి ఇంట్లో నిద్రించిన యువకుడు ఉదయం లేచేసరికి జామచెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు తెలిపారు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని తండ్రి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్...
పాల్వంచ: విద్యుదాఘాతంతో శనివారం ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన నిమ్మల ప్రసాద్ (32) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ముర్రేడువాగు సమీపంలో రైతు పరిమి వెంకన్న పొలంలో మోటర్ రిపేర్ చేసేందుకు వెళ్లాడు. రిపేర్ చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య భానుశ్రీ, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాఘవయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతున్న వృద్ధుడు ...
పాల్వంచరూరల్: పురుగుల మందుతాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు శనివారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మాలోత్ సీతారాములు(69) శుక్రవారం పొలం వద్దకు వెళ్లి పురుగుల మందుతాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉండగా, పక్క పొలం రైతు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడని, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
మహిళా హోంగార్డుపై వరకట్న వేధింపులు
పాల్వంచరూరల్: మహిళా హోంగార్డును వరకట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్త, మామలపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన దుర్గ బూర్గంపాడు పోలీసుస్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తోంది. ఆమె నాలుగున్నరేళ్ల క్రితం పినపాక మండలం టి.కొత్తగూడెం గ్రామానికి చెందిన గంపల ప్రసాద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఏడాది పాప ఉంది. ఇటీవల కొంతకాలంగా అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామలు వేధిస్తున్నారని దుర్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త ప్రసాద్, అత్త రమణ, మామ సత్యంలపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment