శివరాత్రి జాతరల ఆదాయం లెక్కింపు
మధిర: మధిరలోని మృత్యుంజయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన జాతరకు సంబంధించి ఆదాయాన్ని శనివారం లెక్కించారు. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3.80 లక్షల ఆదాయం వచ్చిందని ఈఓ జగన్మోహన్రావు వెల్లడించారు. అలాగే, జాయింట్ వీల్, దుకాణాల ఏర్పాటు, కొబ్బరిచిప్పల సేకరణ, ప్రసాదాల అమ్మకం, కల్యాణ కట్నాలు, పూజల టికెట్ల అమ్మకంతో కలిపి రూ 32.78 లక్షల ఆదాయం నమోదైందని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే రూ.3.52 లక్షల ఆదాయం పెరిగిందని ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రాధ, అర్చకులు రాయప్రోలు సత్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
స్నానాల లక్ష్మీపురంలో రూ.9.47లక్షలు
వైరారూరల్: వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను శనివారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.3,55,450 సమకూరగా, టికెట్ల అమ్మకంతో రూ.2,99,840, దుకాణాల వేలం ద్వారా రూ. 83,350, మిఠాయి షాపుల ద్వారా రూ.50వేలు, ప్రసాదాల అమ్మకంపై రూ.1,39,500, కొబ్బరిచిప్పల వేలంతో రూ.19వేలతో పాటు కల్యాణ కట్న కానుకలు కలిపి రూ.9,47,564 ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. ఈకార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కె.వేణుగోపాలచార్యులు, ఈఓ హరిచ్రందశేఖర్, ఉత్సవ కమిటీ చైర్మన్ దొడ్డా ఉషారాణితో పాటు దొడ్డా పుల్లయ్య, మల్లు రామకృష్ణ, నూతి వెంకటేశ్వర్లు, మొగునూరు సత్యనారాయణ, మల్లు శేషమ్మ, సుల్తాన్ పద్మా, తలారి నర్సింహారావు, సంగేపు రామకృష్ణ, గిరగాని శ్రీనివాసరావు, మైబ్‌జానీ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కోటిలింగాల జాతరకు రూ.3.54లక్షలు
కారేపల్లి: మహా శివరాత్రి సందర్భంగా కారేపల్లి మండలం బుగ్గవాగు ఒడ్డున శ్రీ కోటిలింగాల ఆలయంలో నిర్వహించిన జాతర ఆదాయాన్ని ఆలయ కమిటీ చైర్మన్ అలెం వెంకటేశ్వర్లు శనివారం ప్రకటించారు. హుండీలో భక్తులు రూ.92,825 సమర్పించగా, కొబ్బరికాయల షాపు వేలం ద్వారా రూ.90వేలు, కొబ్బరిచిప్పల వేలంతో రూ.22వేలు, లడ్డూల అమ్మకం ద్వారా రూ.20వేలు, దర్శన టికెట్ల ద్వారా రూ.1,29,430 కలిపి రూ.3,54,255 ఆదాయం వచ్చిందని తెలిపారు. అయితే, జాతర ఏర్పాట్లకు రూ.3,82,082 ఖర్చు కావడంతో రూ.27,827 లోటు నమోదైందని వెల్లడించారు. గత ఏడాది రూ.50వేలు మిగలగా, ఈసారి భక్తుల సంఖ్య తగ్గటంతో ఆదాయం సైతం తగ్గిందని భావిస్తున్నారు.
మృత్యుంజయ స్వామి ఆలయానికి రూ.32.78లక్షలు
Comments
Please login to add a commentAdd a comment