జోరుగా ఇసుక అక్రమ రవాణా
● ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ● రెండు వారాల్లో ఆరు వాహనాలు సీజ్
ములకలపల్లి: ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మండలంలోని వివిధ వాగుల నుంచి ఆరు నెలలుగా ఇసుక తరలిపోతోంది. రాత్రివేళ పదుల సంఖ్యలో లారీల్లో, ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. ఉమ్మడి పూసుగూడెం పంచాయతీ పరిధి సీతారాంపురం శివారు గుర్రాలకుంట బస్‌షెల్టర్ సమీపంలోని వాగుల నుంచి ఏకలవ్య పాఠశాల, సీతారామ కాంట్రాక్ట్ పనులకు, సత్తుపల్లి, పెనుబల్లి, ఖమ్మం, కొత్తగూడెం తదితర పట్టణాలకు తరలిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల సహకారంతోనే ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కొద్దిరోజులుగా పోలీసులు ఇసుక తరలింపుపై నిఘా పెట్టారు. రెండు వారాల వ్యవధిలో మూడు లారీలు, మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. కాగా ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని, ప్రత్యేక నిఘా పెట్టామని ములకలపల్లి ఎస్‌ఐ కిన్నెర రాజశేఖర్ తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ సీజ్
బూర్గంపాడు: కిన్నెరసాని నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను శనివారం పోలీసులు సీజ్ చేశారు. బుడ్డగూడెం గ్రామ సమీపం నుంచి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్‌ఐ రాజేశ్ తెలిపారు. ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి, యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
చండ్రుగొండలో..
చండ్రుగొండ : మండలంలోని సత్యనారాయణపురం గ్రామ శివారులో ఉన్న ఎదుళ్లవాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను శనివారం రాత్రి సీజ్ చేసినట్లు ఎస్‌ఐ శివరామకృష్ణ తెలిపారు. ట్రాక్టర్ యజమాని నర్సింహారావుపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment