రండి.. రారండి!
ఖమ్మం సహకారనగర్: కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు ఏటా విద్యాసంస్థల బాధ్యులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా చెప్పొచ్చు. ‘మా పాఠశాలలో చేరండి.. మా కళాశాలలో చేరండి’ అంటూ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, సిబ్బంది ప్రచారం చేయడం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సైతం తమ కళాశాలలో చేరాలంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వెళ్లి విస్తృత ప్రచారం చేస్తుండడం గమనార్హం.
ఏకై క కళాశాల..
జిల్లా కేంద్రంలో మహిళా విభాగంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటే ఉంది. ఇక్కడ వివిధ శాఖలకు చెందిన హాస్టళ్లు ఉండడంతో ఇతర ప్రాంతాల విద్యార్థినులు సైతం హాస్టళ్లలో ఉంటూ కళాశాలలో చదివేందుకు ఆస్కారముంది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు ఖమ్మం సమీపాన ఉండడం కలిసొచ్చే అవకాశంగా చెబుతున్నారు.
ప్రత్యేక శ్రద్ధ.. ఉత్తమ ఫలితాలు
ఈ కళాశాలలో విద్యార్థినులపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. దీంతో ఏటా విద్యార్థినులు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహిళా డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ లభించడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే భావనతో ఇక్కడ చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లే కాక వివిధ పోటీ పరీక్షలు, యువజనోత్సవాల్లో అధ్యాపకుల సహకారంతో సత్తా చాటుతున్నారు.
ముందస్తు ప్రచారం
వచ్చే విద్యాసంవత్సరం కళాశాలలో ప్రవేశాల సంఖ్య మరింత పెరిగేలా ప్రభుత్వ ఆదేశాలతో అధ్యాపకులు ముందస్తు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఖమ్మం నగరంతో పాటు సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లోని ప్రభుత్వ, అనుబంధ జూనియర్ కాలేజీలకు వెళ్లి తమ కళాశాలలో ఉన్న వసతులు, ఫలితాలను వివరిస్తున్నారు. ఇందుకోసం ప్రైవేట్ కళాశాలలకు దీటుగా కలర్ బ్రోచర్లు ముద్రించడం విశేషం. ఇలా రకరకాల కారణాలతో వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థినుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల ప్రచారం
సౌకర్యాలు, ఫలితాలను వివరిస్తూ
ప్రవేశాలకు ఆహ్వానం
‘న్యాక్ ఏ’ గ్రేడ్ ఉండడంతో
విద్యార్థినులు సైతం ఆసక్తి
గత కొన్నేళ్లుగా కళాశాలలో ప్రవేశాలు
సంవత్సరం ఎంపీసీ బీజెడ్‌సీ బీఏ బీకాం మొత్తం
2022–23 30 57 86 71 244
2023–24 13 65 80 72 230
2024–25 24 52 84 74 234
వచ్చే ఏడాది అటానమస్ హోదా
1965లో స్థాపించిన ఈ కళాశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. నెట్, సెట్, డాక్టరేట్ అర్హతలు కలిగిన అధ్యాపకులు బోధిస్తున్నారు. 2025 – 26 విద్యాసంవత్సరం నుంచి అటానమస్ హోదా లభించనుంది. ఇప్పటికే న్యాక్–ఏ ఉన్నందున విద్యార్థినులు చేరేందుకు ముందుకు రావాలి.
– జి.పద్మావతి, ప్రిన్సిపాల్,
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల
రండి.. రారండి!
Comments
Please login to add a commentAdd a comment