బైక్ ఢీకొని మహిళ మృతి
దమ్మపేట : అతి వేగంగా వస్తున్న బైక్ ఢీకొనడంతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని మందలపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మందలపల్లి గ్రామానికి చెందిన కుందవరపు లక్ష్మీ నాగరత్నం (60) ఆదివారం రాత్రి ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా అల్లిపల్లి వైపు నుంచి బైక్ పై వెళ్తున్న వ్యక్తి బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆమెను బైకు రోడ్డుపై దూరంగా ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్టుగా ధ్రువీకరించారు.
మోసం చేస్తున్న ముఠాపై కేసు నమోదు
ఖమ్మం అర్బన్ : భూములు లేకపోయినా తప్పుడు రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా రుణాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ముఠా పై కేసు నమోదు చేసినట్లు ఖానాపురం హవేలీ (ఖమ్మం అర్బన్) సీఐ భానుప్రకాశ్ తెలిపారు. నగరంలో ఇటీవల భూ క్రయవిక్రయాలు తగ్గడంతో అక్రమార్జనకు అలవాటు పడిన మాయగాళ్లు ఖరీదైన భూములకు డాక్యుమెంట్లు సృష్టిస్తూ మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారి, మధురానగర్‌కు చెందిన షేక్.బడే సాహెబ్, చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన కొత్తపల్లి వేంకటేశ్వర్లు, తిప్పర్తి అశోక్ కుమార్ (ఆర్‌ఐ)పై కేసు నమోదు చేసి వీరి నుంచి మరిన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
సాగర్ కాల్వలో వ్యక్తి గల్లంతు
కల్లూరు/కల్లూరురూరల్: మండలంలోని పెద్దకోరుకొండి గ్రా మానికి చెందిన గూడూరు శ్రీమన్నారాయణరెడ్డి(35) సా గర్ కాల్వలో గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. శ్రీమన్నారా యణరెడ్డి కొంతకాలంగా కల్లూరులో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం డబుల్ బెడ్‌రూమ్‌ల ఎదురుగా ఉన్న సాగర్ కాల్వలో స్నానం చేసేందుకు వెళ్లాడు.ఈ క్రమంలో జారి నీళ్లలో పడిపోయాడు. ఆ సమయంలో కాల్వలో నీటి ప్రవాహం వేగంగా ఉండడంతో కొట్టుకుపోతుండగా చూసిన వారు గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు కాల్వలోకి దిగి ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. కాల్వ గట్టుపై అతడి దుస్తులు, చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యమయ్యాయి. శ్రీమన్నారాయణరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యులు కల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కుక్కను తప్పించబోయి ఆటో పల్టీ
నేలకొండపల్లి : కుక్కను తప్పించబోయి ఆటో పల్టీ కొట్టిన ఘటన మండలంలోని కొత్తకొత్తూరులో ఆదివారం చోటుచేసుకుంది. బైరవునిపల్లికి చెందిన ఆటో ఖమ్మం వెళ్తుండగా కొత్తకొత్తూరులో కుక్క అడ్డువచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో ఆటోపల్టీ కొట్టడంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో మాత్రం బాగా దెబ్బతిన్నది.
Comments
Please login to add a commentAdd a comment