రోడ్డు ప్రమాదంలో పూజారి మృతి
దుమ్ముగూడెం: మండలంలోని లక్ష్మీనగరం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీ నగరం గ్రామంలోని శ్రీ దాసాంజనేయ ఆలయ పూజారి ఆరుట్ల రాజగోపాలాచార్యులు (50)మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎటపాక మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన మర్మం ఏడుకొండలు బైక్‌పై తన భార్యతో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో లక్ష్మీనగరం శివారులో రోడ్డు దాటుతున్న అర్చకుడిని బైక్‌తో ఢీ కొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్ర గాయాలు కాగా, 108 ద్వారా భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి పూజారి మృతి చెందాడు. ఏడు కొండలు పరిస్థితి విషమంగా ఉండగా, అతని భార్య ఒక కన్ను కోల్పోయింది. వీరు భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని సీఐ అశోక్ సందర్శించి వివరాలు సేకరించారు.
సరిహద్దు గ్రామాల్లో ముమ్మరంగా తనిఖీలు
చర్ల: సరిహద్దు గ్రామాల్లో ఆదివారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. చర్లలో ఆదివారం జరిగిన వారపు సంతకు సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉన్న సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని అటవీ ప్రాంత గ్రామాల ఆదివాసీలు సరుకులు కొనుగోలు కోసం వస్తుంటారు. వారి మాటున మావోయిస్టులు, మిలీషియా సభ్యులు, కొరియర్లు రావచ్చనే అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చర్లకు వచ్చే ప్రధాన రహదారులు తాలిపేరు ప్రాజెక్టు, లెనిన్‌కాలనీ, కలివేరు క్రాస్‌రోడ్, దానవాయిపేట ప్రాంతాల్లో సివిల్, స్పెషల్ పార్టీ, సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు. వచ్చి పోయే వారిని నిశితంగా పరిశీలించారు. పులువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించి విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment