క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయాలి
● ఏజెన్సీ సత్తాను ప్రపంచ దేశాలకు చాటాలి ● ఓఎస్‌డీ పరితోష్ పంకజ్
చర్ల: ఏజెన్సీలో ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులు ఉన్నారని, వారిలోని క్రీడా ప్రతిభను వెలికి తీయాలన్న సంకల్పంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని ఓఎస్‌డీ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ క్రీడా సత్తాను ప్రపంచ దేశాలకు చాటేలా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. చర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ పోటీలను భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్‌తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ క్రికెటర్, ఇండియా టీంకు కెప్టెన్‌గా వ్యవహరించిన మహేందర్ సింగ్ దోనీ జార్ఖండ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన వాడైనప్పటికీ ఆయనలోని క్రీడా సత్తాను ప్రపంచ దేశాలకు చాటిచెప్పాడని అన్నారు. అదే విధంగా భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష మహిళల క్రికెట్ టీంలో ఇండియా తరఫున ఆడి ఘన విజయం సాదించిందని గుర్తు చేశారు. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఏజెన్సీలోని ప్రతీ క్రీడాకారుడు ఉత్సాహంగా ముందుకు సాగాలన్నారు. ఏఎస్‌పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ క్రీడా సత్తా ఉండి ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారిని ఉన్నత శిఖరాలను చేర్చేందుకు ఎస్పీ రోహిత్ రాజ్ నేతృత్వంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందని, వారి గ్రామాల్లో విద్య, వైద్యం, రహదారులు, కమ్యూనికేషన్ వంటి సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈ పోటీలకు చర్ల మండలంలోని వివిధ గ్రామాలతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ధర్మారం, టేకులేరు, జరుపల్లి, జీడిపల్లి, పెదుఉట్లపల్లి గ్రామాలకు చెందిన 49 జట్లు హాజరయ్యాయి. సీఐ ఎ.రాజువర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ 141 బెటాలియన్ కమాండెంట్ రాజ్‌కుమార్, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment