దివ్యాంగులకు ‘శాశ్వత’ పరిష్కారం
● ఇక నుంచి యూడీఐడీ స్మార్ట్ కార్డులు జారీ ● అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక పోర్టల్ ● కార్డుతో దివ్యాంగులకు మరింత ప్రయోజనం ● ఉమ్మడి జిల్లాలో 55,718 మంది దివ్యాంగులు
చుంచుపల్లి: దివ్యాంగులకు జారీ చేసే సదరం సర్టిఫికెట్లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. వాటి స్థానంలో ఇక నుంచి యూనిక్ డిసేబిలిటీ ఐడెంటిటీ కార్డు (యూడీఐడీ) ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చి దివ్యాంగులు నేరుగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటకే ఇవి పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉండగా, ఈ నెల నుంచి మన రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయిలో అమల్లోకి తెస్తున్నారు. గతంలో ఈ స్మార్ట్ కార్డులను పలు చోట్ల దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఇటీవల సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులందరికీ ఈ యూడీఐడీ నంబర్‌ను జనరేట్ చేయాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్డుల కోసం ప్రభుత్వం ఇచ్చిన సంబంధిత వెబ్‌సైట్‌లో దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కేవలం 7 కేటగిరీల్లో మాత్రమే సదరం సర్టిఫికెట్లు ఇస్తుండగా, ఈ యూడీఐడీ కార్డుల అమలుతో ఇక నుంచి 21 కేటగిరీలకు అవకాశం కల్పించారు. దివ్యాంగులకు బస్సు, రైళ్ల ప్రయాణాల్లో అందించే రాయితీలు అలాగే విద్య, వైద్యం, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తదితర వాటిని ఈ గుర్తింపు కార్డు ద్వారా పరిగణనలోకి తీసుకోనున్నారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్ ద్వారా దివ్యాంగులకు రూ.4,016ను ప్రతినెలా అందిస్తున్నారు. అలాగే వారు ఎవరిపై ఆధారపడకుండా ఆర్థికంగా ఎదగడానికి స్వయం ఉపాధి కోసం వివిధ రకాల రాయితీ రుణాలు సైతం అందిస్తున్నారు. మరోవైపు దివ్యాంగులకు సంక్షేమ శాఖ ద్వారా పలు రకాల ఉపకరణాలను అందిస్తున్నారు.
యూడీఐడీ కార్డు ఇలా పొందాలి..
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 55,718 మంది శాశ్వత వైకల్యం కలిగినవారు ఉన్నారు. అంగవైకల్య శాతం ధ్రువీకరణ కోసం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇస్తున్న సదరం ధ్రువపత్రాలు ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే పనిచేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో వీటిని అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో వీటికి బదులు యూడీఐడీ కార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. http:// www. swavlambancard. gov. in పోర్టల్‌లోకి వెళ్లి యూడీఐడీ కార్డు కోసం సమగ్ర వివరాలు పొందుపర్చాలి.
● పాస్‌పోర్టు సైజ్ ఫొటో, సంతకం, ఆధార్ కార్డు తదితర వివరాలు అప్‌లోడ్ చేయాలి.
● మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుని సదరం శిబిరానికి హాజరుకావాల్సి ఉంటుంది.
● సదరం శిబిరానికి హాజరయ్యేలా అందుబాటులోని కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి.
● తద్వారా ఏరోజు శిబిరం నిర్వహిస్తారో దరఖాస్తుదారుడి ఫోన్‌కు సందేశం వస్తుంది.
● ఆ రోజున వెళ్తే అక్కడి వైద్యులు పరీక్షించి వైకల్యం శాతాన్ని నిర్ధారించి పోర్టల్‌లో నమోదు చేస్తారు.
● ఇప్పటికే సదరం ధ్రువపత్రాలు కలిగిన వారికి కూడా స్మార్ట్ కార్డులను ఇదే తరహాలో జారీ చేస్తారు.
● వివరాలను సరిచూసి వైద్యులు నిర్ధారించిన అనంతరం స్మార్ట్ కార్డు మంజూరు చేస్తారు. డిజిటల్ సంతకాలతో కూడిన స్మార్ట్ కార్డులో ఐడీ నెంబర్, దివ్యాంగుడి పేరు, వైకల్య రకం, శాతం తదితర వివరాలు ఉంటాయి. వీటిని నేరుగా దివ్యాంగుల ఇంటి చిరునామాకు పంపుతారు.
● స్మార్ట్ కార్డులతో రైలు, బస్సు టికెట్లపై రాయితీలు పొందవచ్చు. పింఛన్లు, సంక్షేమ పథకాలు, రాయి తీ రుణాలు అందుకునే వెసులుబాటు ఉంది.
● దేశంలో ఎక్కడైనా ఉపయోగించుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది.
● కార్డును శాశ్వతంగా వినియోగించుకునే వీలుంటుంది.
దివ్యాంగులకు స్మార్డ్‌కార్డు వరం
దివ్యాంగులకు పూర్తిస్థాయిలో యూడీఐడీ కార్డులను ఇచ్చేందుకు ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తేవడం మంచి పరిణామం. యూడీఐడీ కార్డుల మంజూరు దివ్యాంగులకు వరం లాంటిది. సదరం సర్టిఫికెట్ల స్థానంలో వీటిని ఇవ్వటం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. దివ్యాంగుల సమగ్ర సమాచారం ఈ కార్డు ద్వారా తెలుసుకోవచ్చు.
–గండపనేని సతీశ్, టీవీపీఎస్
అధ్యక్షుడు కొత్తగూడెం
మరింత ప్రయోజనం
ప్రభుత్వం దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల స్థానంలో యూడీఐడీ కార్డులను అమల్లోకి తెచ్చింది. వీటిపైన దివ్యాంగులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ స్మార్ట్ కార్డును అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇది అన్ని ప్రాంతాల్లో చెల్లుబాటు అవుతుంది. దివ్యాంగులకు దీనివల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది.
–ఎం.విద్యాచందన, డీఆర్‌డీఓ
ఉమ్మడి జిల్లా వివరాలు ఇలా..
భద్రాద్రి ఖమ్మం
సదరం శిబిరాలకు హాజరైనది 31,906 62,390
టెంపరరీ వైకల్యం కలిగినవారు 3,882 7,853
శాశ్వత వైకల్యం కలిగినవారు 19,280 36,438
అనర్హులుగా తేల్చినది 8,744 18,099
దివ్యాంగులకు ‘శాశ్వత’ పరిష్కారం
దివ్యాంగులకు ‘శాశ్వత’ పరిష్కారం
దివ్యాంగులకు ‘శాశ్వత’ పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment