మిథిలా.. వ్యథ
నాడు పొగడ చెట్టు నీడన..
భక్త రామదాసు కాలంలో శ్రీరామనవమి వేడుకలు ఆలయ ప్రాంగణంలో ఉన్న పొగడ చెట్టు నీడన జరిగేవి. ఆ తర్వాత కాలంలో ఆలయం పడమర మెట్ల పక్కన ఉన్న చిత్రకూట మండపంలో ఈ వేడుక నిర్వహించారు. అయితే రానురాను భక్తుల రద్దీ పెరగడంతో ఆలయం వెలుపల చలువ పందిళ్లు వేసి కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 1960లో కల్యాణమండప నిర్మాణ పనులు చేపట్టగా 1964లో ప్రారంభించారు. అనంతరం 1986లో జరిగిన నవమి, మహాసామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమం సందర్భంగా కల్యాణ మండపం చుట్టూ గ్యాలరీ నిర్మించి మిథిలా స్టేడియంగా నామకరణం చేశారు. భద్రాచలంలో జరిగే ముక్కోటి వేడుకల సమయంలోనూ ఉత్తర ద్వారంలో శ్రీరాముడిని దర్శించుకునే భక్తులు మిథిలా స్టేడియం వైపునే ఉంటారు.
పొందిక లేదు.. దర్శనం కరువు
మిథిలా స్టేడియాన్ని ఒకేసారి నిర్మించలేదు. 1960లో పనులు ప్రారంభిస్తే ప్రస్తుతం ప్రసాద్ పథకంలో షెడ్ల నిర్మాణం వరకు వేర్వేరు కాలాల్లో పనులు చేపట్టారు. దీంతో కల్యాణ మండపం, ప్రేక్షకుల గ్యాలరీ, ఉత్తర ద్వారం, గ్యాలరీల మధ్య పొందిక కుదరలేదు. ఈ స్టేడియం గ్యాలరీలో కూర్చునే సామాన్య భక్తులకు ఇటు కల్యాణం, అటు ఉత్తర ద్వార దర్శనం రెండూ సరిగా కనిపించవు. దీనికి తోడు పర్వదినాల్లో ఇక్కడ ఏర్పాటు చేసే పందిళ్ల కారణంగా దైవ దర్శనం మరింత దుర్లభంగా మారుతోంది. ఉచిత దర్శనానికి గ్యాలరీలకు వచ్చే భక్తులతో పాటు రూ.250, రూ.500 తదితర సెక్టార్ల టికెట్లు తీసుకునే భక్తులకు సీతారాముల దర్శనం కనిపించీ కనిపించనట్టుగా జరుగుతోంది. ప్రతీ ఏడాది ఇదే తంతు సాగుతున్నా సామాన్య భక్తుల కష్టాలను పట్టించుకునే వారు కరువయ్యారు.
‘మిథిల’పై దృష్టి సారిస్తే..
శ్రీరామనవమి, ముక్కోటి పర్వదినాలకు వచ్చే ముఖ్యమంత్రులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, జిల్లా కలెక్టర్, ఎస్పీ మొదలు ఆయలం ఈఓ వరకు అందరూ వీఐపీ గ్యాలరీల్లో ఉంటారు. దీంతో సామాన్య భక్తులు, ఆ తర్వాత రూ.250 టికెట్ కొనుగోలు చేసే భక్తుల కష్టాలు వారి దృష్టికి రావడం లేదు. కల్యాణం, ముక్కోటి, దర్శనం ఇలా ఇక్కడికి వచ్చే మంత్రులు, సీనియర్ అధికారులు ఒక్కసారి మిథిలా స్టేడియాన్ని నిశితంగా పరిశీలిస్తే వెంటనే పునరుద్ధరణ చర్యలకు ఉపక్రమిస్తారు. కానీ వచ్చిన చిక్కంతా ఏ ఒక్కరూ ఈ స్టేడియాన్ని పట్టించుకోవడం లేదు. ఆఖరికి నవమి, ముక్కోటి సందర్భంగా నిర్వహించే సమీక్ష సమావేశాల్లోనూ మిథిలా స్టేడియంలో నెలకొన్న సమస్యలు అసలు ప్రస్తావనకే రావడం లేదు. దీంతో మిథిలా స్టేడియం కష్టాల సుడిగుండంలోనే ఉండిపోతోంది.
దాతలు ముందుకొచ్చినా..
ఇప్పటికే భద్రాచంలో స్థల సమస్య తీవ్రంగా ఉంది. ఇలాంటి సందర్భంలో ఆలయం సమీపంలో రెండున్నర ఎకరాల్లో సగానికి పైగా నిరుపయోగంగా ఉన్న మిథిలా స్టేడియం పునరుద్ధరణ, పునర్ నిర్మాణంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. భద్రాచలం ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వివిధ కార్పొరేట్ కంపెనీల వారు, దాతలు తమవంతు సహకారం అందిస్తున్నారు. ఆ దిశలో అయినా మిథిలా స్టేడియంలో నెలకొన్న సమస్యలకు మంగళం పాడాల్సిన అవసరముంది.
సమస్యల వలయంలో స్టేడియం
నిరుపయోగంగా మారిన హాళ్లు
గ్యాలరీ నుంచి చూస్తే దైవ దర్శనం దుర్లభమే
కన్నెత్తి చూసేందుకు ఇష్టపడని సర్కారు పెద్దలు
భూత్ బంగ్లాలను తలపిస్తున్న హాళ్లు..
నిర్వహణపరమైన లోపాల కారణంగా మిఽథిలా స్టేడియం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. ఈ స్టేడియం మధ్యలో కల్యాణ మండపం ఉండగా గ్యాలరీకి దిగువన గోదావరి ఉప నదులైన కిన్నెరసాని, శబరి, ప్రాణహిత, మానేరు, వార్థా, పెన్‌గంగా తదితర పేర్లతో ఎనిమిది పెద్ద హాళ్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. చెత్తా చెదారంతో బూజుపట్టి భూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి. కొబ్బరి ముక్కలు ఆరబెట్టడానికి, పనికిరాని సామాన్లు నిల్వ చేయడానికి ఉపయోగించే గోదాముగా ఉపయోగపడుతున్నాయి. కేవలం పోకల దమ్మక్క నిత్యాన్నదానసత్రం ఒక్కటే శుభ్రమైన వాతావారణంలో నడుస్తోంది. ఆ పక్కనున్న టాయిలెట్ల నుంచి మొదలుపెడితే మిగిలిన గ్యాలరీలన్నీ కనీసం అడుగు పెట్టడానికి వీలు లేనంత అపరిశుభ్రంగా ఉన్నాయి. వీటి మధ్యనే ఉన్న ఒక హాలులో అఖండజ్యోతి రామనామ సంకీర్తణలు నిర్వహిస్తున్నారు.
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలకు సిద్ధమవుతోంది. శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకలకు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ వేడుకలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ఇంతటి ఘనమైన వేడుకలకు వేదికై న మిథిలా స్టేడియం మాత్రం అనేక సమస్యల నడుమ కొడగట్టిపోయినట్టుగా మిగిలిపోతోంది. ఎందరు మంత్రులు వచ్చినా, కలెక్టర్లు మారినా ఈ స్టేడియం తలరాత మాత్రం మారడం లేదు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
మిథిలా.. వ్యథ
Comments
Please login to add a commentAdd a comment