సమష్టిగా పనిచేద్దాం
వాతావరణ ం
జిల్లాలో శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యే ఎండ మధ్యాహ్నానికి పెరుగుతుంది. తెల్లవారుజామున, రాత్రి చలి ప్రభావం ఉంటుంది.
వేడుకల విజయవంతానికి
భద్రాచలం : వచ్చే నెల 6, 7 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాల విజయవంతానికి సమష్టిగా కృష్టి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. వేడుకల నిర్వహణపై గురువారం స్థానిక సబ్ కలెక్టరేట్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీఐపీలే కాకుండా సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలని సూచించారు. గతేడాది ఐక్యంగా పనిచేసి వేడుకలను విజయవంతం చేశామని సిబ్బందిని అభినందించిన కలెక్టర్.. ఈ సంవత్సరం కూడా అలాగే పని చేయాలని పిలుపునిచ్చారు. ఐటీసీ సహకారంతో శాశ్వత పద్ధతిలో మరుగుదొడ్లు నిర్మించాలని, మొబైల్ వాహనాలకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సెల్లార్లలో నిరంతరం తాగునీరు సరఫరా చేసేలా ట్యాప్‌ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. స్టేడియం సమీపంలో అగ్నిమాపక పరికరాలు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న జనరేటర్‌కు అదనంగా మరో 250 కేవీ జనరేటర్‌ను సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఆయా అధికారులకు సూచించారు. ఆ రెండు రోజులు భద్రాచలంలో మద్యం దుకాణాలను మూసివేయించాలన్నారు. భక్తుల నుంచి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు అఽధిక ధరలు వసూలు చేయకుండా చూడాలని చెప్పారు. భక్తుల రద్దీ నియంత్రణకు మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని, వంతెనపై వాహనాలు నిలిచిపోతే తరలించేందుకు క్రేన్లు సిద్ధంగా ఉంచాలని పోలీస్ అధికారులకు సూచించారు.
పర్ణశాలనూ పట్టించుకోండి..
రామాలయానికి అనుబంధంగా ఉన్న పర్ణశాలలోనూ భక్తులకు సరైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పర్ణశాల వెళ్లే దారిలో సైడ్ రోడ్డు బీటీకి ప్రణాళికలు, అంచనాలు అందించాలని, అక్కడ కూడా శాశ్వత మరుగుదొడ్ల పనులను పూర్తి చేయాలని సూచించారు. షాపింగ్ కాంప్లెక్స్ షెడ్ నిర్మాణ ప్రతిపాదనలు అందించలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం ఈ నెలాఖరు వరకై నా పూర్తి చేయాలన్నారు. భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేలా దాతలను ఆహ్వానించాలని, వేడుకల అనంతరం వారిని సత్కరించాలని సూచించారు. కల్యాణ మండపంలో కూలర్లు ఏర్పాటు చేయాలన్నారు.
కుటుంబసభ్యులకు ఆ తర్వాత అవకాశం..
నవమి, పట్టాభిషేకం రోజుల్లో బంధువుల, కుటుంబసభ్యుల దర్శనాలకు అధికారులు, సిబ్బంది ప్రాధాన్యత ఇవ్వొద్దని, అలాంటి నాటకాలు చేయొద్దని ఘాటుగా హెచ్చరించారు. ఆ రెండు రోజుల పాటు వారిని రావొద్దని చెప్పాలని, తాను కూడా ఇప్పటికే ఇంట్లో చెప్పానని అన్నారు. సామాన్య భక్తులు సంతృప్తిగా దర్శించుకునేలా సహకరించాలని కోరారు. వేడుకల హడావిడి ముగిశాక కుటుంబసభ్యులతో వచ్చి ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఈఓకు సూచించారు. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వచ్చే సమావేశం నాటికి పూర్తయిన పనులు, ఏర్పాట్ల వివరాలతో హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ.. నవమి సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందితో పాటు అదనంగా కొందరిని నియమించి పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నట్లు చెప్పారు. ఎస్పీ రోహిత్‌రాజ్ మాట్లాడుతూ 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, ఆర్డీఓలు దామోదర్‌రావు, మధుసూదన్, ఆలయ ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
పర్ణశాలలోనూ తగిన వసతులు కల్పించాలి
నవమి, పట్టాభిషేక మహోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు రావొద్దు
కుటుంబసభ్యులతో హడావిడి చేస్తే చర్య తప్పదు
సన్నాహక సమావేశంలో కలెక్టర్ పాటిల్ స్పష్టీకరణ
దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలి
కొత్తగూడెంఅర్బన్: ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. దరఖాస్తులను ఎల్ –1 ఎల్ –2, ఎల్ –3గా విభజించాలని, అత్యంత పేదలు, దివ్యాంగులు, ఏ ఆధారం లేనివారికి ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అన్ని గ్రామాల్లో దరఖాస్తుల పరిశీలన వివరాలను ప్రతీ రోజు నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఈనెల 31లోగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ధరణి మాడ్యూల్‌లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, హౌసింగ్ పీడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment