జిల్లాలో సగటు ఆదాయం రూ.3,21,281
● ఎనీమియా ముక్త్ భారత్‌లో భేష్ ● ఉపాఽధి హామీలోనూ సత్ఫలితాలు ● అడవుల విస్తీర్ణంలో రాష్ట్రంలో రెండో స్థానం ● సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్ – 2025లో వెల్లడి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: 2025 – 26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ వెంటనే తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం వంటి అంశాల్లో రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లా కొద్ది తేడాతోనే వెనుకంజలో ఉన్నట్టు తేలింది. 2024 – 25లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,46,457 (ప్రస్తుత ధరలు) ఉండగా, స్థిర ధరల ప్రకారం రూ.1.77లక్షలుగా ఉంది. ఈ విషయంలో జిల్లా తలసరి ఆదాయం వరుసగా రూ.3,21,281, రూ.1,73,951గా ఉంది. జిల్లా విస్తీర్ణంలో 44 శాతం అడవులే విస్తరించి ఉన్నప్పటికీ ఇక్కడున్న పరిశ్రమల కారణంగానే రాష్ట్ర తలసరి ఆదాయంతో జిల్లా పోటీ పడగలుతోంది. ఈ నివేదికలో వెల్లడించిన మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి..
రక్తహీనత అరికట్టే దిశగా..
పునరుత్పత్తి దశలో ఉన్న మహిళల్లో రక్త హీనత (ఎనీమియా) సమస్య దేశవ్యాప్తంగా ఉంది. దీని కోసం 2018లో ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. సీ్త్రలలో రక్తహీనత తగ్గించేందుకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ విషయంలో 80 శాతానికి పైగా లక్ష్యాన్ని సాధించిన జిల్లాలు రాష్ట్ర స్థాయిలో 12 ఉండగా భద్రాద్రి జిల్లా 87.80 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది.
‘ఉపాధి’ ఇంకా కావాలి..
ఉపాధి హామీ పథకం ద్వారా అర్హులైన వారికి పని దినాలు కల్పించడంలో జిల్లా 87.50 శాతం ఫలితాలు సాధించింది. రాష్ట్ర స్థాయిలో ఇది 89 శాతంగా ఉంది. ప్రస్తుతం మునగ సాగు, చేపల చెరువు, వెదురు పెంపకం చేపట్టే చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ఉపాధి హామీ వర్తింపజేసేలా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పనితీరులో జిల్లా ముందు వరుసలోకి వెళ్లే అవకాశముంది.
ఇతర వివరాలిలా..
● ఖనిజ సందప ద్వారా ఆదాయాన్ని అందించడంలో జిల్లా మెరుగైన పనితీరునే కనబరుస్తోంది. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా నుంచి రూ.44 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించగా రూ.42.49 కోట్ల ఆదాయం సాధించింది.
● వాణిజ్య ఎగుమతుల్లో దూసుకుపోతున్న జిల్లాల జాబితాలో మనకు చోటుదక్కలేదు.
● జిల్లాలో ఉన్న మొత్తం విద్యుత్ కనెక్షన్లలో 76.50 శాతం గృహ, 12 శాతం వ్యవసాయ, 0.5 శాతం పరిశ్రమలు, ఇతర కనెక్షన్లు 11.10 శాతంగా ఉన్నాయి.
● రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ 100 చదరపు కిలోమీటర్లకు 99.29 కి.మీ రహదారి సౌకర్యం ఉండగా జిల్లాలో ఇది 61 కి.మీ.గానే ఉంది. రోడ్డు కనెక్టివిటీ విషయంలో జిల్లా పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉంది.
● వామపక్ష ప్రభావిత నిధుల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 17.7 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం పూర్తయింది.
● కొత్తగూడెం ఎయిర్‌పోర్టు కోసం రామవరం వద్ద 950 ఎకరాలు గుర్తించామని, ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫీజుబిలిటీ, అబిస్టికల్ లిమిటేషన్ సర్వేలు జరిగాయిని, పూర్తి స్థాయి నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని నివేదికలో పేర్కొన్నారు.
● జిల్లా జనాభా, అర్బన్, రూరల్ పాపులేషన్, లింగ నిష్పత్తి తదితర వివరాలన్నీ 2011 జనాభా లెక్కలకు సంబంధించిన పాత వివరాలే ప్రస్తుత రిపోర్టులోనూ ఉన్నాయి.
41శాతం అడవులే..
ఒక దేశం, రాష్ట్రం లేదా జిల్లా విస్తీర్ణంలో 30 శాతం అడవులు ఉండాలనే నియమాన్ని ప్రపంచ వ్యాప్తంగా పాటించేందుకు కృషి జరుగుతోంది. మన దగ్గర హరితహారం, వనమహోత్సవం పేరుతో ప్రతీ ఏటా మొక్కలు నాటుతున్నారు. రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లోనే 30 శాతం.. అంతకు మించిన విస్తీర్ణంలో అడవులు ఉండగా భద్రాద్రి జిల్లా 41.38 శాతం అడవులతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో ములుగు జిల్లా ఉంది. జిల్లా మొత్తం విస్తీర్ణం, అందులో అడవులను తీసుకుంటే ఇప్పటికీ వనాల విషయంలో భద్రాద్రి బెస్ట్ అనే పరిస్థితి ఉంది.