ఇంట్లో మొక్కలు పెంచుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: ఇంట్లో మొక్కలు పెంచుకుని ఆరోగ్యం కాపాడుకుందామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం ప్రకృతి ఆశ్రమం ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన ప్రకృతి–ఆరోగ్య మహాసభల్లో మాట్లాడారు. చిన్నతనంలో తన తండ్రి మొక్కలు నాటేవారని పేర్కొన్నారు. మునగ ఆకుకు ప్రపంచంలో అమితమైన డిమాండ్ ఉందని అన్నారు. మెడిసినల్ ప్లాంట్స్, కూరగాయ మొక్కలు, ఆకుకూరలను ఇంటిపంటగా పెంచుకుంటే పురుగు మందులు లేని ఆహారం తినవచ్చని చెప్పారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు జయరాజు మాట్లాడుతూ గ్రీన్ ప్రపంచాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఆరోగ్యం, ఆనందం కోసం ప్లాస్టిక్ నిర్మూలన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, సుగుణారావు, డి.సత్యనారాయణ, డాక్టర్ అనిల్ కుమార్ తంబరేణి, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంఘం వెంకట పుల్లయ్య, శనగ వెంకటేశ్వర్లు, డాక్టర్ లక్ష్మణస్వామి, గోనే శ్రీకాంత్, టూమట్ల వెంకన్న పాల్గొన్నారు.