
ప్రజారంజక పాలన అందిస్తున్నాం
● ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కుతున్నాయి ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఎర్రుపాలెం: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రజా పాలన ఫలాలు దక్కేలా జన రంజక పాలన అందిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని కాచారం, కొత్త గోపవరం గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆయన పర్యటించారు. రైతులు, మహిళలు, చిన్నారులు ఇలా అన్ని వర్గాల వారినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని చెప్పారు. కాచారంలో విద్యుత్ సరఫరా ఎలా ఉంది.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడగగా.. గ్రామంలో 200 వరకు కుటుంబాలు ఉన్నాయని, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు విద్యుత్ సరఫరా చాలా నాణ్యతగా వస్తోందని స్థానికులు చెప్పారు. రైతు భరోసాపై ఆరా తీయగా నాలుగైదు ఎకరాలకు వరకు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయని తెలిపారు. గ్రామానికి రేషన్ దుకాణం, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరగా, భట్టి సానుకూలంగా స్పందించారు. అనంతరం కాచారం గ్రామ శివాలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరావు, డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, పీసీసీ సభ్యుడు శీలం ప్రతాపరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నర్సింహారావు, మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, నాయకులు బొగ్గుల గోవర్దన్‌రెడ్డి, అనుమోలు కృష్ణారావు, మల్లెల లక్ష్మణరావు, గంటా తిరుపతమ్మ, శీలం శ్రీనివాసరెడ్డి, తల్లపురెడ్డి నాగిరెడ్డి, దేవరకొండ రాజీవ్‌గాంధీ, గుడేటి బాబురావు, పిల్లి బోస్ పాల్గొన్నారు.