
అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం
● దీపారాధన చేసి తాళం వేసి వెళ్లిన యజమానులు ● మంటలు వ్యాపించి ఫ్లాట్ పూర్తిగా దగ్ధం
ఖమ్మంక్రైం: నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి ఫ్లాట్ పూర్తిగా కాలిపోగా పైఅంతస్తు, పక్క ఫ్లాట్‌కు స్వల్పంగా నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతో భారీ ప్రాణ నష్టం తప్పింది. వివరాలిలా ఉన్నాయి.. బుర్హాన్‌పురంలోని రవీంద్రనాథ్ ఠాగూర్‌నగర్‌లో ఇటీవల పిన్ని టవర్స్ నిర్మించారు. వీటిలో కొన్ని ఫ్లాట్లను కొనుగోలు చేసినవారు నివాసం ఉంటున్నారు. 301 ఫ్లాట్ కొనుగోలు చేసిన సత్తిరెడ్డి ఇంకా గృహప్రవేశం చేయలేదు. కాగా, సత్తిరెడ్డి కుటుంబ సభ్యులు ఆదివారం పండుగ కావటంతో దేవుడి గదిలో దీపం వెలిగించి, పూజ చేసి తాళం వేసి ప్రస్తుతం ఉన్న ఇంటికి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు. వారు వెళ్లిన కొద్దిసేపటి తర్వాత కిటికీలో నుంచి పొగలు రావడాన్ని ఎదురు ఫ్లాట్ వారు గమనించి, కిటికిలో నుంచి చూశారు. వారు అరుస్తూ మంటలను ఆర్పేందుకు తమ ఇంట్లో నీళ్లను పోశారు. అయినా కూడా మంటలు అదుపులోకి రాలేదు. చివరకు వారు నివసిస్తున్న ఫ్లాట్‌కు సంబంధించిన అద్దాలు సైతం మంటల తాకిడికి పగిలిపోయాయి. దీంతో వారు ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకొని వాచ్‌మెన్‌కు సమాచారం అందించగా.. అతను వచ్చి చూడగా అప్పటికే మంటలు పైఅంతస్తులోకి వ్యాపిస్తున్నాయి. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా వారు వచ్చారు.
తప్పిన ప్రాణనష్టం..
ఘటనా స్థలానికి చేరుకొన్న ఫైర్ సిబ్బంది అపార్ట్‌మెంట్‌లో ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అందరినీ కిందకు వెళ్లాలని ఆదేశించారు. మెట్ల మార్గం ద్వారా పైకి చేరుకొని మంటలను ఆర్పుకుంటూ ఆరు కుటుంబాల వారిని క్షేమంగా కిందకు తీసుకొచ్చారు. ఒక ఫైరింజన్ సరిపోకపోవడంతో మరో ఫైరింజన్‌ను రప్పించారు. మహబూబాద్ జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనాథ్ రెస్క్యూ సిబ్బందిని పైకి తీసుకెళ్లి.. ఆయనే స్వయంగా మంటలను ఆర్పివేశారు. రెండు గంటలపాటు శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనతో అపార్ట్‌మెంట్‌వాసులు భయాందోళనకు గురయ్యారు. గంటలోనే అంతా జరిగిపోయిందని అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు. ఇదిలా ఉండగా తాము దీపం వెలిగించలేదని షార్ట్ సర్క్యూట్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని సత్తిరెడ్డి తెలిపారు. ఘటనా స్థలాన్ని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి అజయ్ సందర్శించారు. ఖమ్మం ఫైర్ అధికారి బాలకృష్ణ, సిబ్బంది భాస్కర్‌రావు, కిరణ్‌కుమార్, రాంబాబు, నరసింహారావు, విజయ్‌కుమార్, టూటౌన్ పోలీసులు మంటలన ఆర్పడంతో సఫలీకృతమయ్యారు. కాగా, సుమారు రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు.

అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం