
అందరికీ సరిపడా వసతులు
భద్రాచలం: శ్రీరామనవమికి భద్రాచలం వచ్చే భక్తులందరికీ సరిపడా వసతులు కల్పిస్తున్నామని దేవాదాయ శాఖ కమిషనర్ ఈ శ్రీధర్ తెలిపారు. స్థానిక సబ్ కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణం ప్రత్యేకమని, అందుకే దేశ వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తుంటారని చెప్పారు. అందరికీ తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని, చలువ పందిళ్లు, ఎండ నుంచి ఉపశమనం కలిగేలా మిస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 26 సెక్టార్లు ఏర్పాటు చేస్తుండగా అన్నింటిలోనూ ఎల్‌ఈడీ టీవీలు అందుబాటులో ఉంటాయన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. ఉత్సవాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. కల్యాణం టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భక్తులకు తలంబ్రాలు అందించేందుకు 80 కౌంటర్లు ఏర్పాటు చేశామని, ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. సీఎం రాక కోసం మూడు హెలీప్యాడ్లు సిద్ధం చేస్తున్నామన్నారు. రెండు రోజుల పాటు నిరంతర విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్డీఓ దామోదర్ రావు, ఆలయ ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో పని చేయాలి
దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్
రామయ్యను దర్శించుకున్న కమిషనర్
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వేద పండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనుబంధ ఆలయాలనూ దర్శించుకోగా అధికారులు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు.