పూల పాన్పులు!
ఇసుక తిన్నెలే..
శ్రీరామనవమికి సామాన్య భక్తులకు తప్పని ఇక్కట్లు
● దేవస్థానం పరిధిలోని గదులన్నీ ముందే బ్లాక్ ● దాతల సహకారంతో నిర్మించినవి కావడమే కారణం ● ప్రైవేట్ సెక్టార్‌లోవీ సింహభాగం ఆన్‌డ్యూటీ అధికారులకే.. ● భక్తుల అవసరాలను తీర్చలేకపోతున్న హరిత, టీటీడీ గదులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధీనంలో సౌమిత్రి సదనం, మారుతి సదనం, జానకీ సదనం, శ్రీరామ నిలయం, శ్రీరామ సదనంతో పాటు 14 కాటేజీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 150 వరకు సింగిల్, డబుల్ బెడ్లతో కూడిన ఏసీ, నాన్ ఏసీ గదులు ఉన్నాయి. వీటి అద్దె ఒక రోజుకు కనిష్టంగా రూ.448 నుంచి గరిష్టంగా రూ.2,400 వరకు ఉంటాయి. సీతారాముల దర్శనానికి వచ్చే భక్తులు బస చేసేందుకు ఈ గదులను అద్దెకు ఇస్తారు. ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో గదులు బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. దీంతో రాబోయే నవమి నాడు సీతారాముల కల్యాణం కళ్లారా చూసేందుకు భద్రాచలం వచ్చే భక్తులు ఈ గదులు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా, వారికి నిరాశే ఎదురైంది. ఏప్రిల్ 4, 5, 6, 7 తేదీల్లో దేవస్థానం ఆధీనంలో ఉన్న గదులన్నీ బ్లాక్ అయి ఉన్నాయి.
కరకట్ట మెట్లు, ఇసుక తిన్నెలే దిక్కు..
ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన గదులు, డార్మెటరీలే ప్రస్తుతం సామాన్య భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా తాత్కాలిక ప్రాతిపదికన కరకట్ట దిగువన, విస్తా కాంప్లెక్స్ సమీపంలో భారీ షెడ్లు నిర్మిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ షెడ్లు.. ఇక్కడా చోటు లభించకపోతే కరకట్ట మెట్లు, గోదావరి తీరంలో ఉన్న ఇసుక తిన్నెలే దిక్కవుతున్నాయి. ప్రతీ ఏడాది ఈ తంతు జరుగుతున్నా ఈ సమస్యపై అధికారులు దృష్టి సారించడం లేదు.
ప్రైవేటులోనూ కష్టమే..
భద్రాచలంలో ప్రైవేట్, హోం స్టే విధానంలో సుమారు 600 వరకు గదులు అందుబాటులో ఉన్నాయి. నవమి సందర్భంగా ఉమ్మడి ఖమ్మంతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన ప్రభుత్వ సిబ్బంది, పోలీసులు విఽధి నిర్వహణ నిమిత్తం భద్రాచలం వస్తారు. దీంతో ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్న గదుల్లో సగం వరకు సిబ్బందికే సరిపోతున్నాయి. ఇతర భక్తులకు పరిమిత సంఖ్యలోనే గదులు లభిస్తున్నాయి. డిమాండ్ ఎక్కువ, గదులు తక్కువ కావడంతో పర్వదినాల్లో వీటి అద్దె ఒక రాత్రికి రూ.5,000 వరకు చేరుతోంది. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో భక్తితో భద్రాచలం వచ్చే భక్తులు ఈ ధరలు చూసి బెంబేలెత్తున్నారు. మరికొందరు అంత డబ్బు వెచ్చించేందుకు సిద్ధపడినా గదులు దొరకని పరిస్థితి ఉంటోంది. దీంతో తాము ప్రయాణించిన వాహనాల్లోనే నిద్రించి, మరుసటి రోజు గోదావరిలో స్నానం చేసి దర్శనాలకు వెళ్లాల్సి వస్తోంది.
కొత్తవి కావాలి..
భద్రాచలంలో ఉన్న హరిత హోటల్‌లో పరిమిత సంఖ్యలోనే గదులు ఉన్నాయి. శ్రీరామనవమి, ముక్కోటి సమయాల్లో ఉండే డిమాండ్‌కు ఇవి ఏ మూలకూ సరిపోవు. దీంతో చాలా మంది భక్తులు ముందురోజు సమీపంలోని పాల్వంచ, కొత్తగూ డెం, ఖమ్మంలో బస చేసి, నవమి రోజు ఉదయం భద్రాచలం వస్తున్నారు. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా భద్రాచలంలో సామాన్య భక్తులకు వసతి, బస సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరముంది.
దాతల కోసం..
నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన భద్రాచలం దేవస్థానం ఆధీనంలో ఉన్న గదుల్లో సింహభాగం దాతల సహకారంతో నిర్మించినవే. భద్రాచలం సీతారాములకు ప్రపంచ నలుమూలలా భక్తులున్నారు. వీరిలో చాలా మంది భద్రాచలంలో గదుల నిర్మాణానికి తమ వంతు ఆర్థిక సహాయం అందించారు. వారు భద్రాచలం వచ్చినప్పుడు, లేదా వారు సిఫార్సు లేఖలు ఇచ్చిన భక్తులు ఆయా గదుల్లో బస చేసే వీలు ఉంటుంది. సాధారణ రద్దీ రోజుల్లో ఈ గదులు భక్తులకు ఉపయోగపడుతున్నప్పటికీ శ్రీరామనవమి, ముక్కోటి వంటి పర్వదినాలు, ఇతర పండగ రోజుల్లో వారికి కేటాయించే అవకాశం ఉండడం లేదు. ఇక వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్మించిన సత్రాలు, కాటేజీలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు.
పూల పాన్పులు!