
వీకే –7 ఓసీకి ఈసీ అనుమతి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని వీకే –7 ఓపెన్ కాస్ట్ గనికి ఎట్టకేలకు ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్(ఈసీ) అనుమతులు లభించాయి. దీంతో మరో రెండు నెలల్లో ఇక్కడ ఓబీ (ఓవర్ బర్డెన్) పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులు పూర్తయితే 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగూడెం ఏరియా నుంచి సుమారు 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అదనంగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసీ అనుమతుల కోసం దాదాపు మూడేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది.
లక్ష్య సాధనకు మార్గం..
సింగరేణి సంస్థ ప్రతీ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశిస్తుంది. అయితే వీకే –7 ఓసీకి ఈసీ అనుమతులు లభించడంతో 2025 – 26 ఆర్థిక సంవత్సర లక్ష్యాల సాధన కొంత సులువు కానుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలో ఆఫ్ లోడింగ్, ఓసీలో హాల్‌రోడ్లు, మెటీరియల్ సరఫరా తదితర పనులు పూర్తి చేసుకుంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత వార్షిక లక్ష్యం 76 మిలియన్ టన్నులు చేరుకునేందుకు మార్గం సుగమం కానుంది. దీంతో పాటు ఒడిశాలోని నైనీబ్లాక్‌లో కనీసం ఆరు మిలియన్ టన్నులు తోడయితే 11 మిలియన్ టన్నుల ఉత్పత్తి అదనంగా వచ్చే అవకాశం ఉంది.
ఎట్టకేలకు ఫారెస్ట్ క్లియరెన్స్..
సుమారు 1,114 హెక్టార్ల విస్తీర్ణంలో దాదాపు 190 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నట్లు ఎక్స్‌ప్లోరేషన్ అధికారుల అంచనా. దాదాపు 35 సంవత్సరాల జీవితకాలం ఉన్న వీకే –7 ఓసీలో 1000 మందికి ఉపాధి కలగనుంది. అయితే ఈ గనికి 773 హెక్టార్లలో అటవీ భూములు అవసరం అవుతాయి. ప్రస్తుతం సింగరేణి ఆధీనంలో 341 హెక్టార్ల స్థలం ఉండగా.. అది కూడా వివిధ కాలనీల రూపంలో ఉందని అధికారులు చెబుతున్నారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందజేస్తారని తెలుస్తోంది. ప్రైవేట్ భూ యజమానుల సమస్య పరిష్కారం అయినప్పటికీ, అటవీ భూముల సమస్య జఠిలంగా మారింది. ఈ నేపథ్యంలో అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా, వేరేచోట భూమి ఇచ్చినా ఆ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అనుమతులు రాకముందే టండర్ ఖరారు..
వీకె–7 ఓసీకి గతేడాది అనుమతులు వస్తాయని భావించిన యాజమాన్యం రెండు సంవత్సరాల క్రితమే ఓబీ టెండర్‌ను ఖరారు చేసుకుంది. మూడేళ్ల క్రితం ఓసీకి అనుమతులు వస్తాయని, పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేసి, టెండర్లను కూడా ఖరారు చేయడంతో సదరు కాంట్రాక్టర్లు కంపెనీపై ఒత్తిడి పెంచుతున్నారు. అనుమతులు రాకముందే టెండర్లు ఎలా కట్టబెట్టారని, మూడేళ్ల పాటు తామేం చేయాలని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
రెండు నెలల్లో ప్రారంభం కానున్న ఓబీ పనులు
అనుమతి రావడం హర్షణీయం
వీకె–7 భూగర్భ గని మూడబడడంతో గత మూడేళ్లుగా ఏరియాలో ఉత్పత్తి కొంత తగ్గింది. జీకే ఓసీలో నిక్షేపాలు అడుగంటగా ఈ లోటును జేవీఆర్ ఓసీ పూడ్చుతున్నప్పటికీ.. ఈ రెండు గనుల్లో సుమారు 1,400 మంది కార్మికుల సర్దుబాటు కష్టమైంది. ఇప్పుడు వీకే ఓసీ స్టేజ్–1కు అనుమతి రావడం హర్షణీయం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తే ఇంత జాప్యం అయ్యేది కాదు.
– ఎం. శాలెంరాజు, కొత్తగూడెం ఏరియా జీఎం

వీకే –7 ఓసీకి ఈసీ అనుమతి