
విశ్వావసు తరలివస్తోంది..
కాలం కదిలిపోతోంది
అనుభవాలను అనుభూతులను కానుకగా ఇచ్చి
కష్టాలను నష్టాలను గుణపాఠాలుగా నేర్పి
కాలం కదిలిపోతోంది
ఆత్మీయతలను అనురాగాలను
అల్లుకున్న బంధాలను
బహు చక్కగా పరిచయం చేస్తూ
కాలం కదిలిపోతోంది
ప్రాకృతిక పరిణామాలను
మానవజీవితంలో ప్రతిబింబిస్తూ
తీపి చేదు వగరు పులుపు కారం క్షారతల షడ్రుచుల సమ్మేళనమై కాలము కదిలివస్తోంది
విశ్వావసు నామ సంవత్సర యుగాదిగా
కాలం కదిలి వస్తోంది
తీపి చేదు జ్ఞాపకాల సమాహారమై గతమై..
క్రోధి నామ సంవత్సరం తరలిపోతోంది
రేరాజు రాజై.. సకల సౌభాగ్యాలను అందించగా..
మానవ మనో మందిరాలలో కరుడుగట్టిన కర్కశత్వాన్ని కరిగించి సౌమ్యతనే నింపగా
సకల శుభములనందించగా
చైత్రమాసపు వసంత సొబగులతో
కాలం కదలివస్తోంది
విశ్వావసు నామ సంవత్సర ఉగాదిగా..
నీకు నాకు సమస్త ప్రకృతికి
నూతన ఆశల ఊపిరిలూదుతూ
కాలం.. విశ్వావసు నామ సంవత్సరమై తరలివస్తోంది.
– సుమలత, ఉపాధ్యాయురాలు, బాలికల ప్రభుత్వ పాఠశాల, భద్రాచలం