
సేవా లోపంపై వినియోగదారుల ఫోరం తీర్పు
ఖమ్మంలీగల్: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ విషయమై ఒప్పందాన్ని విస్మరించడంతో తీసుకున్న డబ్బును వడ్డీతో సహా చెల్లించడమే కాక నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఖమ్మం వినియోగదారుల ఫోరం సభ్యురాలు ఎ.మాధవీలత శనివారం తీర్పు చెప్పారు. భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన గుగులోత్ రాంచందర్, గుగులోత్ లక్ష్మి 2016 డిసెంబర్‌లో ఖమ్మం వెలుగుమట్ల సమీపాన జీఆర్‌ఆర్ శ్రీనివాస వశిష్ఠ బ్లాక్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జీఆర్‌ఆర్ రియాలిటిస్ మేనేజింగ్ పార్టనర్ గుర్రం ప్రకాష్‌తో ఒప్పందం కుర్చుకుని రూ.16 లక్షలు చెల్లించారు. కానీ గడువులోగా ఫ్లాట్ ఇవ్వకపోవడమే కాక ఎన్నిసార్లు అడిగినా స్పందించకపోవడంతో రాంచందర్, లక్ష్మి న్యాయవాది ద్వారా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీంతో వివరాలు పరిశీలించాక రూ.16 లక్షలను ఏడు శాతం వడ్డీతో చెల్లించాలని, నష్టపరిహారంగా రూ.3 లక్షలు, ఖర్చుల కింద రూ.10 వేలు ఇవ్వాలని తీర్పు చెప్పారు.
కారు షోరూం యాజమాన్యానికి..
కారు మరమ్మతు చేయించినా మొరాయిస్తుండడంతో షోరూం బాధ్యులు స్పందించలేదని వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. ఖమ్మం ధంసలాపురానికి చెందిన బండారు రమ్య కియా సోనెట్ కారును ఖమ్మం కియా షోరూంలో కొనుగోలు చేయగా, కొన్నాళ్లకు ప్రమాదం జరిగింది. ఈ మేరకు షోరూంలో రూ.1,97,157 వెచ్చించి మరమ్మతు చేయించినా తరచుగా సమస్య వస్తోంది. దీంతో న్యాయవాది ద్వారా ఖమ్మం వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించడంతో ఫోరమ్ ఇన్‌చార్జ్ చైర్మన్ లలిత వాదనలు విన్నాక కొత్త సామగ్రితో కారు మరమ్మతు చేసి ఇవ్వాలని తీర్పు చెప్పారు. అంతేకాక రూ.30 వేల పరిహారం, ఖర్చుల కింద రూ.10 వేలను ఫిర్యాదికి అందించాలని విజయవాడలోని సింహ మోటార్స్ బాధ్యులను తీర్పులో ఆదేశించారు.