భూగర్భజలాల పెంపునకు కృషి చేయండి
డీపీఓ రాజమౌళి
చండ్రుగొండ : భూగర్భజలాలు పెంచేందుకు రైతులు తమవంతు కృషి చేయాలని, వ్యవసాయ క్షేత్రాల్లో బోరుబావుల వద్ద ఫాంపాండ్‌లు నిర్మించాలని జిల్లా పంచాయతీ అధికారి రాజమౌళి సూచించారు. ఇళ్లలో ఇంకుడుగుంతల నిర్మాణంతోనూ భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. చండ్రుగొండ మండలం తుంగారం, అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన, పెద్దిరెడ్డిగూడెం గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని మండల అధికారులను ఆదేశించారు. కూలీలు పనిచేసే ప్రదేశంలో నీడ కోసం టెంట్లు, తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. నర్సరీలపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ ఖాన్, టీఏ రాము తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌గా అమరనేని
సింగరేణి(కొత్తగూడెం): ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్‌గా అమరనేని రామారావు, కన్వీనర్‌గా సంగం వెంకటపుల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక పెన్షనర్ల కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎంపిక జరగగా, వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత, పెండింగ్ పీఆర్సీ, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు, ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న బకాయిల మంజూరుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
‘ఇందిరమ్మ’ పనులు ప్రారంభించండి
పాల్వంచరూరల్ : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా ఇంకా పునాదులు తీయని లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని హౌసింగ్ పీడీ శంకర్ అన్నారు. మండల పరిధిలోని తోగ్గూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ పరిధిలో 200 ఇళ్లు మంజూరైతే 60 మంది మాత్రమే పునాదులు తీసి పనులు చేపట్టారని, మిగిలిన వారు త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఆయన వెంట ఏఈ రమేష్, గ్రామ కార్యదర్శి రవికుమార్ ఉన్నారు.
భూగర్భజలాల పెంపునకు కృషి చేయండి