● ఈ ఏడాదే ప్రకటించాలని కోరుతున్న భక్తులు ● భద్రాచలంలో సీతారాముల పెళ్లికి వందల ఏళ్ల చరిత్ర ● ప్రతీ సంవత్సరం కనులపండువగా కల్యాణ వేడుక ● నవమి రోజున ఉభయ రాష్ట్రాల్లోనూ ఆధ్యాత్మిక శోభ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో వందల ఏళ్లుగా జరుగుతున్న సీతారాముల కల్యాణం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఘన చరిత్ర కలిగిన ఈ వేడుకకు సముచిత గుర్తింపు, నిధులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత పదేళ్లుగా ఆశించిన సహకారం కరువైంది. అయితే ఇప్పుడీ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆలయం, భద్రాచలం పట్టణ అభివృద్ధిపై దృష్టి పెరిగింది. తొలి విడతలో రూ.60 కోట్లు కేటాయించగా ఇందులో రూ.34 కోట్లు విడుదల కూడా అయ్యాయి. ఆలయ అభివృద్ధి నమూనాకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఊహా చిత్రాలకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ఇదే ఒరవడిలో ఈ ఏడాది నుంచి శ్రీరామ నవమి వేడుకలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
సీఎం చేతుల మీదుగా..
మధ్యయుగాల కాలంలో పాల్వంచ తహసీల్దార్‌గా పని చేసిన కంచర్ల గోపన్న భద్రాచలంలో సీతారాములకు ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత కాలంలో ఇక్కడ చైత్ర శుద్ధ నవమి రోజున స్వామి, అమ్మవార్ల కల్యాణం జరిపించే పద్ధతిని ఆయన ప్రవేశపెట్టారు. అనంతరం అప్పటి గోల్కొండ నవాబు తానీషా సైతం ఈ వేడుకలో భాగమయ్యారు. సీతారాముల పెళ్లికి స్వయంగా హాజరై పట్టువస్త్రాలు సమర్పించడమే కాకుండా ముత్యాల తలంబ్రాలు, గులాల్‌తో పాటు ఆర్థికంగా తోడ్పాటు అందించారు. స్వాతంత్రం వచ్చేనాటికి నవమి వేడుకలకు అప్పటి ప్రభుత్వం తరఫున రూ.1,300 ఇచ్చేదని రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇప్పటి తెలంగాణ వరకు నవమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. కొన్నేళ్లుగా ఈ సంప్రదాయానికి బ్రేక్ పడినా.. ఈసారి ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తారని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
ఊరూ వాడా జరిగే వేడుక..
భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకల విశేషాలను అప్పట్లో భక్తులు రేడియోల్లో వినేవారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రత్యేక బృందం భద్రాచలం వచ్చేది. ఆ తర్వాత దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారాలు వచ్చేవి. మారిన పరిస్థితుల్లో టీవీలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, మొబైల్ ఫోన్లలో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు లైవ్ స్ట్రీమింగ్‌లో ఈ వేడుకలను చూస్తున్నారు. ఇక్కడ జరిగే పెళ్లి వేడుకలకు సమాంతరంగా తెలుగు నేలపై పల్లె, పట్నం తేడా లేకుండా వేలాది ఆలయాల్లో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో ఆదర్శ దంపతుల వివాహ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. అయితే భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర పండుగ హోదా దక్కితే ఇటు దేవాదాయ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి నిధులు మంజూరవుతాయి. ఫలితంగా ఆలయంతో పాటు పట్టణంలో మౌలిక సదుపాయాలూ మెరుగవుతాయి.
రాష్ట్ర పండుగ హోదా వస్తే..
భారీ స్థాయిలో భక్తులు వచ్చే పుణ్యక్షేత్రాల్లో మెరుగైన సౌకర్యాలు, రవాణా సదుపాయాలతో పాటు విస్తృత ప్రచారం చేస్తే పెట్టిన పెట్టుబడికి రెట్టింపునకు మించి లాభాలు వస్తాయనడానికి తాజా ఉదాహరణ ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా. రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.3లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రకటించారు. రాష్ట్రంలో మేడారం జాతర మరో ఉదాహరణగా నిలుస్తోంది. ఒకప్పుడు గిరిజన పూజారులే చందాలు వసూలు చేసి జాతర నిర్వహించేవారు. ప్రభుత్వ సహకారం నామమాత్రంగా ఉండేది. అయితే 1996లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా నాటి ప్రభుత్వం గుర్తించగా.. వేడుకల నిర్వహణకు రూ.2 కోట్లు కేటాయించారు. ఆ వెంటనే 1998లో జంపన్న వాగుపై వంతెన నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి మేడారం జాతరకు భక్తుల రాక, నిధుల ప్రవాహం పెరిగాయి. ఒకప్పుడు అడవిలా ఉన్న మేడారం ఇప్పుడు చిన్న పట్టణంగా మారింది. సెలవు రోజుల్లో భక్తులు తండోపతండాలుగా మేడారం వస్తుంటారు. స్థానికులకూ ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి.
రామయ్య కల్యాణానికి.. కావాలి రాష్ట్ర హోదా