లక్ష్యం చేరనట్టే..?
● పన్ను వసూళ్లలో మున్సిపాలిటీల వెనుకబాటు ● చివరిలో 90 శాతం వడ్డీ రాయితీ అవకాశం ● ఆర్థిక సంవత్సరంలో మిగిలింది ఐదు రోజులే..
కొత్తగూడెంఅర్బన్: మున్సిపాలిటీల్లో ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్థిక సంవత్సరం మరో ఐదు రోజుల్లో ముగియనుంది. కానీ పన్ను వసూలు లక్ష్యానికి చాలా దూరంలోనే ఉంది. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీల్లో ఇల్లెందు మినహా మిగిలిన మున్సిపాలిటీల్లో ఇంటి పన్నులు వసూలు లక్ష్యంలో సగం వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వార్డుల్లో మున్సిపల్ బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ సిబ్బంది తిరుగుతున్నా పన్ను వసూలు పూర్తి స్థాయిలో కావడం లేదు. ఇంటి పన్ను కట్టని వారి పేర్లను వార్డుల్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తామని, ఆస్తులను జప్తు చేస్తామని అధికారులు ఇటీవల హెచ్చరికలు జారీ చేసినా పన్ను చెల్లింపులు మెరుగుపడలేదు. ఏటా పురపాలికల్లో లక్ష్యం పూర్తికావడంలేదు. దీంతో బకాయిలు మరుసటి సంవత్సరంలో కలుస్తుండగా లక్ష్యం పెరిగిపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 19.42 కోట్ల పన్ను వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.12.11 కోట్లే వసూలు చేశారు.
90 శాతం వడ్డీ రాయితీ
పేరుకుపోయిన మొండిబకాయిలు వసూలు చేసేందుకు మున్సిపల్‌శాఖ 90 శాతం వడ్డీ రాయితీని బుధవారం నుంచి అమలు చేస్తోంది. ఈ అవకాశం ఈ నెల 31వ తేదీ వరకే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మొండిబకాయిలకు ఇంటి పన్ను ఎంతో ఉంటుందో, వడ్డీ కూడా అంత పెరిగింది. దీంతో ప్రజలకు పన్ను చెల్లింపులు భారంగా మారింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ రాయితీ ఇస్తుండటంతో చెల్లింపుదారులకు ఊరట కలుగనుంది. రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పన్ను చెల్లించి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. అయితే వడ్డీ రాయితీకి మూడు, నాలుగు రోజులకే పరిమితం చేయకుండా నెల రోజులపాటు అవకాశం ఇస్తే ఎక్కువ మంది వినియోగించుకునే అవకాశం ఉంటుంది. పన్ను చెల్లింపులు కూడా పెరుగుతాయి. కాగా పన్ను బకాయిలు పేరుకుపోతుండగా ఆదాయం తగ్గి వేతనాలు, ఇతర అభివృద్ధి పనులకు మున్సిపల్ జనరల్ ఫండ్‌ను వినియోగించాల్సి వస్తోంది. దీంతో జనరల్ ఫండ్‌తో చేపట్టాల్సిన పనులకు ఆటంకం ఏర్పడుతోంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు 56 మంది, వార్డు ఆఫీసర్లు 57 మంది, మొత్తం 113 మంది ఉన్నారు. వీరంతా ఇంటింటికీ తిరిగి పన్ను వసూళ్లు చేస్తే ఆదాయం పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.
రెండు మున్సిపాలిటీలకు ఒక్కరే కమిషనర్
కొత్తగూడెం, పాల్వంచ రెండు మున్సిపాలిటీలకు ఒక్కరే కమిషనర్‌గా వ్యహరిస్తున్నారు. దీని వల్ల మున్సిపల్ అధికారులు, సిబ్బందిని సమన్వయం చేయడంలో జాప్యం జరుగుతోంది. కమిషనర్ పూర్తిస్థాయిలో సమయం కేటాయించే అవకాశం లేకపోవడంతో కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
మున్సిపాలిటీల్లో నివసించే ప్రజలు 90 శాతం వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 31న సెలవు అయినప్పటికీ మున్సిపల్ కార్యాలయం తీసి ఉంటుంది. పన్నులు చెల్లించవచ్చు. పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి.
–సుజాత, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్
మున్సిపాలిటీ వార్డులు లక్ష్యం వసూలు
రూ.కోట్లలో
కొత్తగూడెం 36 7.93 4.84
పాల్వంచ 24 6.36 3.80
ఇల్లెందు 24 2.68 2.09
మణుగూరు 20 2.45 1.38
మొత్తం 104 19.42 12.11
లక్ష్యం చేరనట్టే..?