అశ్వారావుపేటరూరల్: పదో తరగతి పరీక్షా కేంద్రాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అశ్వారావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర, బాలికల పాఠశాలల కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. అనంతరం మండల పరిధిలోని వినాయకపురం గ్రామ శివారులో ఉన్న శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేశారు. జాతరకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ వనం కృష్ణ ప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
పవర్ లిఫ్టింగ్ పోటీలకు 1న ఎంపికలు
భద్రాచలంటౌన్ : పట్టణంలో వచ్చేనెల 1న జిల్లాస్థాయి పవర్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలను జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీవి రామిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై నవారిని హైదరాబాద్ రామంతపూర్‌లో ఏప్రిల్ 18 19 తేదీల్లో జరిగే క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు, మేలో జరిగే ఎక్యిప్పీడ్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకుని రావాలని, ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని వివరించారు.
బేకరీ తినుబండారంలో పురుగు
వినియోగదారుల ఫోరంను ఆశ్రయించిన
బాధితుడు!
పాల్వంచ: పట్టణంలోని బీసీఎం రోడ్‌లో ఉన్న ఓ బేకరీ షాపులో తినుబండారం ఆర్డర్ ఇవ్వగా అందులో పెద్ద పురుగు ప్రత్యక్షమైంది. ఇదేమని వినియోగదారుడు ప్రశ్నించగా షాపు నిర్వాహకుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వినియోగదారుల ఫోరంలో కేసు వేసినట్లు సమాచారం.
నేడు ‘నిధి ఆప్‌కే నికట్’
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఈనెల 27న ‘నిధి ఆప్‌కే నికట్’ నిర్వహించనున్నట్లు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ బి.నాగుల్ తెలిపారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం ఎస్‌బీఐటీ కళాశాలలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇల్లెందు మున్సిపాలిటీలో ఉదయం 9–30 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జెడ్పీ సీఈఓ సందర్శన
దమ్మపేట: మండల పరిషత్ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి బుధవారం సందర్శించారు. కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం జమేదారుబంజర గ్రామంలో పర్యటించి పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, పల్లె ప్రకృతి వనం, నర్సరీలను సందర్శించి, పలు సూచనలు చేశారు. ప్రాథమిక పాఠశాలలో తాగునీటి ట్యాంకు, వంట షెడ్డు, మరుగుదొడ్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, వారి పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రా రెడ్డి, ఎంపీఓ రామారావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా
పదో తరగతి పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. గణిత పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 12,273 మందికి గాను 12,240 మంది హాజరుకాగా, 33 మంది గైర్హాజరయ్యారు. సప్లిమెంటరీ విద్యార్థులు 360 మందికి గానూ 320 మంది హాజరు కాగా 43 మంది గైర్హాజరయ్యారు. అడిషనల్ కలెక్టర్, ఇద్దరు జిల్లా పరిశీలకులు డీఈఓ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం కలిసి 28 సెంటర్లు తనిఖీ చేశారు. ఈ మేరకు డీఈఓ ఎం.వెంకటేశ్వరచారి వివరాలు వెల్లడించారు. ఎటువంటి మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లో అదనపు కలెక్టర్ తనిఖీలు