బడ్జెట్‌లో తీపి కబుర్లు | - | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో తీపి కబుర్లు

Mar 28 2025 1:49 AM | Updated on Mar 28 2025 1:45 AM

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాల విభజనకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాల్లో మెదక్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాలను మినహాయిస్తే ప్రతీ జిల్లాలో ఒక యూనివర్సిటీ స్థాపన జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేయాలనే డిమాండ్‌ రాష్ట్ర విభజన ముందు నుంచే వినిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో గిరిజన యూనివర్సిటీని ఈ జిల్లాలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసినా అది ములుగు జిల్లాకు తరలిపోయింది. దీంతో కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీని మైనింగ్‌ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేయాలనే డిమాండ్‌ తెర మీదకు వచ్చింది. ఈ డిమాండ్‌ నాయకులు, ప్రజల నోళ్లలో నానుతుండగానే జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగంలో పలు ఇంజనీరింగ్‌ కాలేజీలు తెలంగాణలో వచ్చాయి. దీంతో మైనింగ్‌ వర్సిటీ డిమాండ్‌ సైతం ప్రాభవం కోల్పోయింది. అయితే ఈ కాలేజీని ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేయడంతో మరోసారి యూనివర్సిటీ అంశం తెర మీదకు వచ్చింది.

సీఎం రేవంత్‌రెడ్డి హామీ

కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీని ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు జరుగుతాయంటూ శాసన మండలిలో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ రావడం ఖాయమైంది. సింగరేణి బొగ్గు గనులను దృష్టిలో ఉంచుకుని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మైనింగ్‌ విభాగాన్ని 1978లో కొత్తగూడెం తరలించారు. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌గా మార్చారు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా వేలాది మంది ఇంజనీర్లు ఈ కాలేజీ నుంచి బయటకు వచ్చి దేశ మైనింగ్‌ అవసరాలకు ఉపయోగపడ్డారు. నిధుల కొరత, పర్యవేక్షణ లేమి, అధ్యాపకులు రాకపోవడం, ల్యాబుల ఆధునికీకరణ ఆగిపోవడంతో కొన్నేళ్లుగా ఈ కాలేజీ ప్రాభవాన్ని కోల్పోతోంది. ప్రస్తుతం యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించడంతో మరోసారి ఈ కాలేజీకి గత వైభవం రానుందనే నమ్మకం కలిగింది. సుమారు 400లకు పైగా ఎకరాల్లో కళాశాల క్యాంపస్‌ విస్తరించి ఉంది. ఈ కాలేజీ భూముల్లోనే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, జిల్లా అధికారుల సమీకృత కార్యాలయాల భవనం(కలెక్టరేట్‌) నిర్మించారు.

నిధుల విడుదల

దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం పట్టణంలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. తెలంగాణ వచ్చాక భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామంటూ అప్పటి సర్కారు ప్రకటన చేసింది. అయితే ఇది ఒక పట్టాన అమలుకు నోచుకోలేదు. ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రధాన ఆలయం చుట్టూ మాడ వీధుల విస్తరణ ఇతర అభివృద్ధి పనుల కోసం కేటాయించిన రూ.60 కోట్లలో రూ.34 కోట్లు విడుదల అయ్యాయి. ఇక పర్యాటక శాఖపై జరిగిన చర్చలో కిన్నెరసాని, కనకగిరి గుట్టలు, భద్రాచలం దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య చేసిన ప్రయత్నాలు విఫలం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై అసెంబ్లీలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో గుమ్మడికి సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడమే కాకుండా బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత ఇల్లెందు–సీతారామ అంశంపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

కొత్తగూడెంలో యూనివర్సిటీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

కొత్తగూడెం కార్పొరేషన్‌, కల్లూరు మున్సిపాలిటీల బిల్లు ఆమోదం

భద్రాద్రికి నిధుల విడుదల, ఇల్లెందుకు దక్కిన సీతారామ హామీ

బడ్జెట్‌ సమావేశాల్లో ఉమ్మడి జిల్లాకు వరాలు

కార్పొరేషన్‌ బిల్లు ఆమోదం

కొత్తగూడెం – పాల్వంచ – సుజాతనగర్‌లను ఒక్కటిగా చేస్తూ కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు గత జనవరి 4న రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తదుపరి కార్యాచరణలో భాగంగా ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో కొత్తగూడెం కార్పొరేషన్‌ బిల్లును మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఆ తర్వాత జరిగిన చర్చలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆమోదం పొందింది. మరోవైపు ఇదే బడ్జెట్‌లో నగరాభివృద్ధి పద్దు కింద కొత్తగూడెం కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు కేటాయించారు. మరోవైపు కల్లూరుకు మున్సిపాలిటీ హోదా దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement