కన్నీటి వేదన..
● విషాదంగా మారిన భవనం కూలిన సంఘటన ● భవన నిర్మాణ కార్మికుడు కామేశ్వరరావు మృతి ● మరో కార్మికుడు ఉపేందర్ ఆచూకీ కోసం సహాయక చర్యలు ● బంధువుల ఆందోళనతో భద్రాచలంలో ఉద్రిక్త పరిస్థితి
అధికారుల నిర్లక్ష్యం వల్లే..
అధికారుల నిర్లక్ష్యం కారణంగా నా భర్త ఉపేందర్ శిథిలాల్లో చిక్కుకున్నాడు. ఈ ఘటనకు అధికారులు బాధ్యత వహించి మా ఇంట్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలి. రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలి. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
– పడిసాల రమాదేవి, ఉపేందర్ భార్య,
లంబాడీ కాలనీ, భద్రాచలం
భద్రాచలం అర్బన్: భవన నిర్మాణ కార్మికుల కుటుంబ సభ్యుల రోదనలు, బంధువుల ఆందోళనలతో భద్రాచలంలో విషాదం నెలకొంది. మరో వైపు రెస్క్యూ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మండుటెండల్లో కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణలతో శిథిలాల తొలగింపు పనులు సాగుతున్నాయి. భద్రాచలంలో ఐదు అంతస్తుల భవనం కూప్పకూలిన ఘటనలో బుధవారం అర్ధరాత్రి శిథిలాల కింద చల్లా కామేశ్వరరావును గుర్తించి బయటకుతీశారు. 12 గంటల పాటు మృత్యువుతో పోరాడి ఆస్పత్రికి తరలించిన కొంతసేపటికే మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి 1.47 గంటలకు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 2.20 గంటలకు మృతి చెందాడు. మరో కార్మికుడు పడిసాల ఉపేందర్ ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, విపత్తుల నివారణ శాఖ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
కుటుంబీకులు, బంధువుల ఆందోళన
ఉపేందర్ ఆచూకీ గురువారం మధ్యాహ్నం వరకు లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీవాసులు ఆందోళనకు దిగారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఉన్నతాధికారులదే బాధ్యత అని ఆరోపించారు. బాధిత కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం నెలకొని ఉద్రిక్తతకు దారితీసింది. అంతకుముందు బ్రిడ్జి సెంటర్ వద్ద కూడా ఆందోళన చేపట్టారు. కాగా సంఘటనా స్థలం వద్ద ఉపేందర్ భార్య రమాదేవి, కుమారుడు జశ్వంత్, కుమార్తె నందుశ్రీ, రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. తమకు దిక్కెవరంటూ ఏడుస్తున్న వారిని సముదాయించటం కష్టతరమైంది.
కొనసాగుతున్న సహాయక చర్యలు
రెస్క్యూ బృందాలు మరో కార్మికుడు ఉపేందర్ ఆచూకీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం స్నీపర్ డాగ్‌తో ప్రయత్నించినా ఫలితం రాలేదు. దీంతో క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఇనుప చువ్వలను కట్ చేసి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షించగా, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పరిశీలించారు.
దుర్వాసన వచ్చిన వైపుగా..
గురువారం మధ్యాహ్నం ఇంటి యజమాని శ్రీపతి శ్రీనివాస్‌కు చెందిన ఓ లాకర్ శిథిలాల నుంచి బయట పడగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 7 గంటల సమయంలో భవన ప్రవేశ ద్వారం వైపు దుర్వాసన వస్తుండటంతో.. అటువైపుగా శిథిలాల తొలగింపు పనులు సాగుతున్నాయి. రాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
కామేశ్వరరావు మృతితో విషాద ఛాయలు
చల్లా కామేశ్వరరావు మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు అవివాహుతుడు. ఏడాది క్రితం తండ్రి మృతి చెందడంతో తల్లి రేవతి తానే సాకుతున్నాడు. ఇద్దరు అక్కలు ఉన్నారు. కాగా కామేశ్వరరావు మృతి చెందడంతో తల్లి ఒంటరిగా మారింది. కాగా పలువురు రాజకీయ నాయకులు బాధితులను పరామర్శించారు.
ఈ దుర్ఘటనకు
బాధ్యులెవరు?
కొడుకు సంపాదన మీదనే..
గత ఏడాది నా భర్త మృతిచెందాడు. ఇప్పుడు నా కొడుకు కామేశ్వరరావు కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. కొడుకు సంపాదన మీదనే బతుకుతున్నాను. అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇల్లుతోపాటు నష్టపరిహారం రూ. కోటి ఇవ్వాలి. – చల్లా రేవతి,
కామేశ్వరరావు తల్లి, జగదీష్‌కాలనీ, భద్రాచలం
గతంలో 13మందిని కాపాడాం
బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరిగితే లేయర్స్ ప్రకారం రెస్క్యూ చేసుకుంటే వెళ్తాం. వాటితో ఈ ప్రమాదాన్ని పోల్చలేం. ఇది ఆర్‌సీసీ స్ట్రక్చర్ కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ నమ్మశక్యంగా చేయొచ్చు. గతంలో కారేపల్లిలో ఓ కళాశాల కుప్పకూలిన ఘటనలో 13 మందిని కాపాడాం. – అనంతరామయ్య,
సింగరేణి రెస్క్యూ అడిషనల్ మేనేజర్, కొత్తగూడెం
ఇలాంటివి పెద్ద పట్టణాల్లోనే..
25 మంది సిబ్బంది, 10 మంది అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాం. వీఎల్‌ఎస్, కాంబి టూల్, హైడ్రాలిక్ కట్టర్, వంటి పరికరాలను రెస్క్యూలో ఉపయోగిస్తున్నాం. సాధారణంగా ఇలాంటి ఘటనలు పెద్ద పట్టణాల్లోనే చూస్తాం. కాగా మొదటి సారి ఇలాంటి ఘటనలో పాల్గొంటున్నాను. –క్రాంతి కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి
IIలో
కన్నీటి వేదన..
కన్నీటి వేదన..
కన్నీటి వేదన..