● భార్యను కాపాడుకోలేకపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ● అనారోగ్యంతో బాధపడుతూ మృతి
పాల్వంచరూరల్ : జీపీఎఫ్ నగదు అందని కారణంగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కాపాడుకోలేకపోయాడు. చేతిలో డబ్బు లేక సరైన వైద్యం అందక ఆమె మృతి చెందింది. ఈ సంఘటన జిల్లా పాల్వంచలో గురువారం జరిగింది. పాల్వంచలోని వెంకటేశ్వర హిల్స్ కాలనీకి చెందిన పొదిలి సత్యనారాయణ స్థానిక కేటీపీఎస్ బాలికల హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య లత(52) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో వైద్యం చేయించేందుకు జీపీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఏడాది క్రితమే మంజూరైంది. కానీ ఇప్పటివరకు నగదు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. దీంతో మెరుగైన వైద్యం అందించకపోవడంతో ఆమె మృతి చెందింది. దహన సంస్కారాల అనంతరం ఉపాధ్యాయులు పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తహశీల్దార్ వివేక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.వెంకటేశ్వరరావు, బి.రవి మాట్లాడుతూ ఉపాధ్యాయుడి భార్య మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జీపీఎఫ్ నగదు అందక మెరుగైన వైద్యం చేయించలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే నగదు ఖాతాల్లో జమచేయాల్సి ఉందని, కానీ ఏడాది గడిచినా నగదు అందకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరాంమూర్తి, ఉపాధ్యాయులు వి.శ్రీనివాసరావు, భూక్యా శ్రీనివాసరావు, సంఘమేశ్వరరావు, ప్రభావతి, సుధాశ్రీ, మోతీలాల్, శంకర్ పాల్గొన్నారు.
జీపీఎఫ్ నగదు అందక..