భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో గిరిజన మ్యూజియం పర్యాటకులకు కనువిందు చేసేలా ముస్తాబు చేశామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియాన్ని గురువారం ఆయన సందర్శించి అందులోని పెయింటింగ్, కళాఖండాలు, వెదురుతో తయారుచేసిన కళారూపాలు, బాక్స్ క్రికెట్ గ్రౌండ్, గిరిజన వంటకాల కోసం తయారుచేస్తున్న స్టాళ్లను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరామనవమి రోజున ఈ మ్యూజియాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈక్రమంలో పెయింటింగ్‌తో పాటు గిరిజన తెగలకు చెందిన దేవతామూర్తులను ప్రతిష్ఠించడం పూర్తిచేసిన్నట్లు పేర్కొన్నారు. గోరు బంజారా సంప్రదాయానికి సంబంధించిన పెయింటింగ్ చిత్రాలతో పాటు మిగిలిన పనులు కూడా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేస్తామని తెలిపారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన బోటింగ్ చెరువులో అందమైన పూల మొక్కలు, చిన్న చిన్న చేపల పెయింటింగ్ చిత్రాలు వేయించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ రమణయ్య, భాస్కర్, ప్రభాకర్‌రావు, పవర్ వేణు, హరీష్, హరికృష్ణ, మ్యూజియం ఇన్‌చార్జ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్