‘నవమి’కి అన్ని శాఖలూ సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

‘నవమి’కి అన్ని శాఖలూ సన్నద్ధం

Apr 4 2025 12:18 AM | Updated on Apr 4 2025 12:18 AM

‘నవమి

‘నవమి’కి అన్ని శాఖలూ సన్నద్ధం

● ఏపీ, తెలంగాణ నుంచి భద్రాచలానికి 300 బస్సులు.. ● 16 ప్రథమ చికిత్స కేంద్రాలు, 52 మంది వైద్యులు, 178 మంది సిబ్బంది విధులు ● 66 మందితో అగ్నిమాపక శాఖ, 15 మందితో సింగరేణి రెస్క్యూ టీమ్‌ ● ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన టూరిజం శాఖ

భద్రాచలంఅర్బన్‌ : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈనెల 6,7 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకలకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి కల్యాణం, పట్టాభిషేకం ఉత్సవాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. దీంతో ఖమ్మం ఆర్టీసీ రీజియన్‌ పరిధిలోని ఏడు డిపోల నుంచి ఈనెల 5, 6, 7 తేదీల్లో 200 బస్సులు ఏర్పాటు చేశామని, వీటికి అదనంగా ఏపీ నుంచి మరో 100 బస్సులు రానున్నాయని భద్రాచలం ఆర్టీసీ డీఎం తిరుపతి తెలిపారు. ఇంకా భద్రాచలం నుంచి కూకట్‌పల్లికి రెండు, మియాపూర్‌కు రెండు సర్వీసులు నడిపిస్తున్నట్లు చెప్పారు. భద్రాచలం బస్టాండ్‌లో 6వ తేదీన రెడ్డిసత్రం వారి సౌజన్యంతో రెండు వేల మంది భక్తులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నామని, ఐటీసీ సహకారంతో మజ్జిగ, బిస్కెట్‌ ప్యాకెట్లు అందజేస్తున్నామని వివరించారు. ఇప్పటికే బస్టాండ్‌లో ఒక చలివేంద్రం ఏర్పాటు చేశామని, మరికొన్ని కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మూడు రోజులు వైద్య సేవలు..

శ్రీరామనవమి వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఏమైనా అనారోగ్య సమస్య ఎదురైతే వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ సన్నద్ధమైంది. గతంలో భద్రాచలంలో ఎనిమిది, పర్ణశాలలో రెండు ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ ఏడాది వాటిని 16కు పెంచారు. తొలిసారి సారపాకలో సైతం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చైతన్య తెలిపారు. కల్యాణాన్ని వీక్షించే ప్రతి సెక్టార్‌లో ఒక వైద్యుడితో పాటు నలుగురు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని, ఇలా మొత్తం 52 మంది వైద్యులు, 178 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని చెప్పారు. అత్యవసర సేవల కోసం 50వేల ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధం చేయగా, భక్తుల కోసం 50 బెడ్లతో ప్రత్యేక వార్డు, పట్టణంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఐదు బెడ్ల చొప్పున అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఇక వేడుకల సందర్భంగా విస్తృత పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఏఎస్పీ, 15 మంది డీఎస్పీలు, 59 మంది సీఐలు, 188 మంది ఎస్సైలతో సహా మొత్తం 2వేల మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. భద్రాద్రితో పాటు ఖమ్మం, మహబూబాబాద్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచి పోలీసులు రానున్నారు.

రూ.10 లక్షలతో విద్యుత్‌ మరమ్మతులు..

ఈనెల 6, 7 తేదీల్లో భద్రాచలంలో విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా ఆ శాఖ ఎస్‌ఈ మహేందర్‌ ఆదేశాల మేరకు భద్రాచలం డీఈ జీవన్‌ కుమార్‌ రూ.10లక్షల వ్యయంతో అవసరమైన మరమ్మతులు చేపట్టారు. మిథిలా స్టేడియం వద్ద గత పదేళ్లుగా 250 కేవీ జనరేటర్‌ మాత్రమే ఉండేది. ఈ ఏడాది 500 కేవీ జనరేటర్‌ను అధికారులు అందుబాటులో ఉంచారు. శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలంలో 70 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్న పంచాయతీ..

రామయ్య కల్యాణానికి భక్తులు భారీగా రానుండగా పట్టణంలో పారిశుద్ధ్య సమస్య సహజం. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు జిల్లాలోని 19 మంది ఎంపీఓలు, 75 మంది పంచాయతీ కార్యదర్శులు విధులకు రానున్నారు. జిల్లా పంచాయతీ అధకారి చంద్రమౌళి పర్యవేక్షణలో డీఎల్‌పీఓ సుధీర్‌ ఆధ్వర్యంలో 300 మంది సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నారు. భక్తుల సౌకర్యార్థం 140 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో 28 చోట్ల తాగునీటి కేంద్రాలు. బ్రిడ్జి వద్ద లైటింగ్‌, బ్లీచింగ్‌, ఫినాయల్‌, యాసిడ్‌ స్ప్రే తదితర సేవలు అందించనున్నారు. ఇందుకు గాను గ్రామ పంచాయతీ అధికారులు రూ.35 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. ఇక టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ. కోటి వ్యయంతో భద్రాచలం, పర్ణశాలలో 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

అగ్నిప్రమాదం జరిగితే..

శ్రీరామనవమి సందర్భంగా ఇల్లెందు, ఆశ్వారావుపేట, పినపాక, భద్రాచలం అగ్నిమాపక కేంద్రాల నుంచి మొత్తం 66 మంది విధుల్లో పాల్గొంటారు. వీరికి అదనంగా సింగరేణి నుంచి 15 మంది రెస్క్యూ సిబ్బందితో పాటు రెస్కూ ఫైర్‌ ఇంజిన్‌, కేటీపీఎస్‌, హెవీవాటర్‌ ప్లాంట్ల నుంచి ఆరు వాటర్‌ టెండరింగ్‌ ఫైర్‌ ఇంజన్లు, 2 ఫైర్‌ బుల్లెట్‌ బైక్‌లు, 70 అగ్నిమాపక యంత్రాలను (సిలిండర్లు) సిద్ధం చేసినట్లు భద్రాచలం అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు.

‘నవమి’కి అన్ని శాఖలూ సన్నద్ధం1
1/1

‘నవమి’కి అన్ని శాఖలూ సన్నద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement