పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం

Apr 5 2025 12:20 AM | Updated on Apr 5 2025 12:20 AM

పెద్దమ్మతల్లికి  పంచామృతాభిషేకం

పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం

పాల్వంచరూరల్‌: శ్రీదేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణపుష్పాలతో పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి ) ఆలయంలో శుక్రవారం వసంత మహోత్సవాలను పురస్కరించుకుని నాదానీరాజనం, సూక్తి పారాయణ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, లక్ష కుసుమార్చన, శ్రీలలితా సహస్రనామహవనం జరిపారు. అమ్మవారికి హారతి ఇచ్చి మంత్రపుష్పాన్ని సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

ముగిసిన కుష్ఠు బాధితుల గుర్తింపు సర్వే

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలో ముగిసిన కుష్ఠు వ్యాధి బాధితుల గుర్తింపు సర్వే ముగిసిందని డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 17 నుంచి 30వ తేదీ వరకు వ్యాధి గ్రస్తుల గుర్తింపు సర్వే నిర్వహించామని, శుక్రవారంతో ఆన్‌లైన్‌ ప్రక్రియ కూడా ముగిసిందని పేర్కొన్నారు. సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ సర్వే నిర్వహించారని పేర్కొన్నారు. సర్వేలో 1,702 మందిని అనుమానిత లక్షణాలు ఉన్న వారిగా గుర్తించామని తెలిపారు. 2,88,368 ఇళ్లను సందర్శించి 12,13,576 మందిని పరీక్షించామని, మొత్తం ఐదు కొత్త కేసులను గుర్తించామని వివరించారు. ప్రారంభ దశలో గుర్తించి చికిత్స పొందితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపారు. వ్యాధి కారక క్రిమి శరీరంలోకి ప్రవేశించాక లక్షణాలు బయటపడడానికి రెండు నుంచి ఐదు సంవత్సరాల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుందని వివరించారు.

టెక్నికల్‌ టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సులో శిక్షణ

కొత్తగూడెంఅర్బన్‌: రాష్ట్రంలోని హైదరాబాద్‌, హన్మకొండ, నిజామాబాద్‌, నల్గొండ, కరీంనగర్‌లలో మే 1 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు టెక్నికల్‌ టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతితో పాటు లోయర్‌ గ్రేడ్‌ టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు ఉత్తీర్ణత సాధించినవారు శిక్షణకు అర్హులని, ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకుని అడ్మిట్‌ కార్డు పొందాలని వివరించారు. అడ్మిషన్లు ఈ నెల 17 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయని, పూర్తి వివరాలకు 99890 27943 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

7న మ్యాథ్స్‌,సైన్స్‌

క్విజ్‌ పోటీలు

కొత్తగూడెంఅర్బన్‌: మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌ సర్కిల్స్‌ కార్యక్రమాల్లో భాగంగా 8, 9 తరగతుల విద్యార్థులకు జిల్లాస్థాయి టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కొత్తగూడెంలోని జిల్లా విద్యాశిక్షణా కేంద్రంలో జరుగుతుందని, 8, 9 తరగతుల విద్యార్థులకు వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని, అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరుకావాలని తెలిపారు. పాల్గొనే విద్యార్థుల వివరాలు జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి నాగరాజశేఖర్‌కు అందించాలని కోరారు.

నేడు ఐజీ పర్యటన

కొత్తగూడెంటౌన్‌: జిల్లాలో శనివారం మల్టీజోన్‌–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పర్యటించనున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రాపురం హెడ్‌ క్వార్టర్స్‌లో విలేకరులతో సమావేశం కానున్నారని ఎస్పీ రోహిత్‌రాజు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కమనీయం...

శ్రీవారి కల్యాణం

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామి సమేత అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల కల్యాణం జరిపించారు. ఇటీవల నిర్మించిన వకుళామాత స్టేడియానికి శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తోడ్కొని వచ్చిన అర్చకులు పట్టువస్త్రాలతో అలంకరించాక కల్యాణ క్రతువు ఆరంభించారు. ఈక్రమాన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం నుంచి తీసుకొచ్చిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ఆలయ ఈవో జగన్మోహన్‌రావు దంపతులు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement