
ఆదివాసీ సంస్కృతి అందరికీ తెలియాలి
● గిరిజన మ్యూజియం ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ● గుడ్ జాబ్ అంటూ పీఓకు కితాబు
భద్రాచలంటౌన్: ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో ప్రాచుర్యం ఉందని, వాటి ప్రత్యేకతలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో నిర్మించిన గిరిజన మ్యూజియాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మ్యూజియంలో పొందుపర్చిన ప్రతీ వస్తువు విలువైనదని, వీటిని సేకరించడం గొప్ప విషయమని అన్నారు. పూర్వీకులు ఎలాంటి జీవనం గడిపారో ఈ వస్తువులను చూస్తే అర్థమవుతోందని అన్నారు. పూర్వపు గుర్తులతో పాటు ఆదివాసీ పల్లెలు గుర్తొచ్చేలా ఆహ్లాద వాతావరణం సృష్టించడం అభినందనీమన్నారు.
గుడ్‌జాబ్ అంటూ కితాబు..
ఆదివాసీల అచార వ్యవహారాల వస్తువులను సేకరించి ఒకచోట చేర్చడం సామాన్యమైన విషయం కాద ని, ‘గుడ్ జాబ్’ అంటూ పీఓ రాహుల్‌ను గవర్నర్ అ భినందించారు. మ్యూజియాన్ని మరింతగా అధునికీకరించేలా కృషి చేసి పర్యాటకులు, సందర్శకుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వంటలు బాగున్నాయి..
మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులోని స్టాళ్లను సందర్శించిన గవర్నర్.. ఆదివాసీ వంటకాల్లో బొద్ది కూర పచ్చడిని రుచి చూసి బాగుంది అన్నారు. ‘తెలుగు రాక రుచి చెప్పలేకపోతున్నా దీన్ని ఏమంటారు’ అని ఇంగ్లిష్‌లో అడిగారు. భాష రాక మాట్లాడలేక పోతున్నా.. ఏమీ ఎనుకోకండి అని ఆదివాసీ మహిళలతో అన్నారు. ఈసారి తెలుగు నేర్చుకుని వచ్చి అన్ని వంటల రుచులు చెబుతానని అనగా.. మహిళలు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. వారు తయారు చేసి మూలికల అయిల్, ఇప్ప లడ్డూలతో పాటు పలు రకాల స్వీట్లు గవర్నర్‌కు ఇవ్వగా వాటికి డబ్బు చెల్లించారు. కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, కలెక్టర్ జితేష్ వి పాటిల్, పీఓ బి.రాహుల్, ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
కోయ భాషలో పలకరించిన తుమ్మల
మ్యూజియం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. గవర్నర్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన విద్యార్థులతో కోయ భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ‘నాటే చదవ మిన్నారే.. రోడ్డుకు మంచిక మిన్నాకే’ అంటూ కోయభాషలో యోగక్షేమాలు తెలుసుకున్నారు. మంత్రి తుమ్మల కోయ భాషలో అనర్గళంగా మాట్లాడగా అందరూ ఆసక్తిగా విన్నారు.