
మళ్లీ ట్రాఫిక్ పాట్లు
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో సోమవారం వీవీఐపీల తాకిడి పెద్దగా లేకపోయినా స్థానికులు ట్రాఫిక్‌పాట్లు తప్పలేదు. శ్రీరాముడికి పట్టాభిషేకం జరపగా, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, కోరం కనకయ్య కూడా పాల్గొన్నారు. వీరితోపాటు ముగ్గురు, నలుగురు వీఐపీలు మాత్రమే ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ట్రాఫిక్ నిబంధనల పేరుతో ఆదివారం రాత్రి చాలా సేపు వరకు బారికేడ్లు తొలగించకుండా స్థానికులను ఇబ్బందికి గురిచేశారు. సోమవారం ఉదయం గవర్నర్ భద్రాచలం వచ్చే 20 నిమిషాల ముందు నుంచే బ్రిడ్జి సెంటర్‌లో ట్రాఫిక్ నిలిపివేయగా భక్తులు, ద్విచక్రవాహనదారులు ఎండ వేడి కారణంగా అవస్థ పడ్డారు. మిథిలా స్టేడియంలో పట్టాభిషేకం కార్యక్రమాన్ని గవర్నర్ ముగించుకుని ఐటీడీఏలో గిరిజన మ్యూజియాన్ని ప్రారంభించేందుకు బయలుదేరిన సమయంలో కూడా బ్రిడ్జి సెంటర్ నుంచి ఐటీడీఏ రోడ్డు వరకు అన్ని వాహనాలను ఆపేశారు. అనంతరం ఐటీడీఏలో కార్యక్రమాలను ముగించుకుని గవర్నర్ సారపాకకు తిరిగి వెళ్తున్న క్రమంలో మరోసారి ఐటీడీఏ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు ఉన్న కాలనీల వీధుల్లోని వాహనాలను మెయిన్ రోడ్డు మీదకు రాకుండా దాదాపు 20 నిమిషాల వరకు నిలిపివేశారు. భద్రాచలంలో 6,7 తేదీల్లో జరిగిన శ్రీరామనవమి, పట్టాభిషేకం కార్యక్రమాలలో పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో పాటు, భక్తులు, స్థానికులు అసౌకర్యానికి గురయ్యారు.
వాహనాలు నిలిపివేయడంతో
స్థానికుల అవస్థ

మళ్లీ ట్రాఫిక్ పాట్లు