
పేదలకు పక్కా ఇళ్లే లక్ష్యం
● లబ్ధిదారుల ఇష్ట ప్రకారమే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవచ్చు ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి ● కోయగూడెంలో ఎమ్మెల్యే, పీఓతో కలిసి శంకుస్థాపన
టేకులపల్లి: పేదలంతా పక్కా ఇళ్లల్లో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు తమకు నచ్చినట్టుగానే నిర్మించుకోవచ్చని చెప్పారు. మండలంలోని కోయగూడెంలో మంజూరైన 303 ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌తో కలిసి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పేదల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే పట్టుదలతో రూ.15.15 కోట్లతో 303 ఇళ్లు మంజూరు చేశామన్నారు. మొత్తం నాలుగు విడతల్లో రూ.5 లక్షలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన, సహజ సిద్ధమైన ఇటుకలు, మెటీరియల్ వినియోగించాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాగానే సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయబోదని స్పష్టం చేశారు.
సన్న బియ్యంతో లంచ్..
రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్న నేపథ్యంలో మండలంలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి సురేష్ – శశికళ దంపతుల ఇంట్లో కలెక్టర్, ఎమ్మెల్యే, పీఓ తదితరులు మధ్యాహ్న భోజనం చేశారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులు తమ ఇంటికి రావడంతో సురేష్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో హౌసింగ్ పీడీ శంకర్, ఏఈ డేవిడ్, ఏటీడీఓ రాధ, సివిల్ సప్‌లై డీటీ పాషా, డీఎస్పీ చంద్రభాను, తహసీల్దార్ నాగభవానీ, ఎంపీడీఓ రవీంద్రరావు, మాజీ సర్పంచ్ కోరం ఉమ, కోరం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.