
ఎండల్లో బండ్లు జాగ్రత్త
కొత్తగూడెంటౌన్: ఎండలు భగభగ మండిపోతున్నాయి. బయటకు వెళ్తే ఎండవేడిమితో అవస్థ పడాల్సి వస్తోంది. అధిక ఉష్ణోగ్రతలకు మనతోపాటు వాహనాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. వాహనాలను ఎండలో పార్కింగ్ చేస్తే ట్యాంకులు, టైర్లు పేలే అవకాశం లేకపోలేదు. ఎండలో ప్రయాణించేటప్పుడు పెట్రోల్, డీజిల్ లీకై ఏ చిన్న నిప్పు రవ్వపడ్డా పెనుప్రమాదం సంభవిస్తుంది. ఎండల నుంచి మనం ఎలా రక్షణ చర్యలు తీసుకుంటున్నామో వాహనాలకూ అదే రీతిలో రక్షణ చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులు, నిపుణులైన మెకానిక్‌లు సూచిస్తున్నారు. ద్విచక్రవాహనాలపై దూర ప్రయాణాలు చేయొద్దని చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే కొత్తగూడెం ఫైర్ ఆఫీస్ 87126 99296, ఇల్లెందు ఫైర్ ఆఫీస్ 87126 99295 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
ద్విచక్ర వాహనదారులు ఇవి పాటించాలి
● ద్విచక్రవాహనాలను క చ్చితంగా నీడలోనే పార్కింగ్ చేయాలి.టైర్లలో గాలిని తగ్గించుకోవాలి.
● వాహనాలను గంటల తరబడి ఎండలో ఉంచితే రంగు కోల్పోతాయి. మళ్లీ రంగులు వేయించాలంటే దాదాపు రూ.6 నుండి 10 వేల వరకు ఖర్చు అవుతుంది.
● ఎండలో ఎక్కువ సేపు నిలిపి ఉంచితే వాహనాల ట్యాంకుల్లోని పెట్రోల్ ఆవిరి అవుతుంది.
● ఫుల్ ట్యాంకు పెట్రోల్ కొట్టిస్తే ఎండలకు ట్యాంకులు పేలే అవకాశం ఉంటుంది.
● రాత్రి వేళల్లో పెట్రోల్ ట్యాంకు మూతను ఓ సారి తెరిచి మూసివేస్తే అది సెట్ అవుతుంది.
కార్లు, లారీల యజమానులు..
● కార్లు, లారీలు, ఆటోలు వంటి వాహనాల్లో దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి.
● వాహనాలను ఎండలో ఉంచితే ట్యాంకులో 40 నుంచి 80 శాతం ఇంధనం ఆవిరి అవుతుంది.
● వాహనాల రేడియేటర్లలో తగినన్ని నీళ్లు ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఎండలకు ఇంజన్‌లు తరుచుగా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఎండ వేడికి ఇంజన్ అయిల్ తగ్గిపోతుంది.
● పెట్రోల్, డీజీల్, గ్యాస్ వాహనాలు నడిపే వారు వీలైనంత వరకు వేసవిలో గ్యాస్ కిట్‌ను వినియోగించుకుండా చూసుకోవాలి. కార్లలో ఏసీ వినియోగిస్తే అద్దాలకు మ్యాట్స్‌ను బిగించుకోవాలి.
● ఎల్‌పీజీ వాహనాలను వేసవిలో ఉపయోగించకపోవడమే మేలు.
● ప్రభుత్వ అనుమతి ఉన్న గ్యాస్ కిట్లను మాత్రమే ఉపయోగించాలి. నాసిరకానివి వినియోగిస్తే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
● ప్రస్తుతం ఉదయం 8, 9 గంటలు దాటితే ఎండ తీవ్రత ఉంటోంది. వాహనదారులు ఎండలో ప్రయాణాలను చేయకూడదు.
● ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైకులు, కార్ల వినియోగం కూడా పెరుగుతోంది. వేసవిలో ఈవీలతో యజమానులు చాలా జాగ్రత్తలు పాటించాలి. చార్జీంగ్ పెట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా బ్యాటరీ వేడిగా ఉన్నప్పుడు చార్జింగ్ పెట్టకూడదు.
అప్రమత్తంగా ఉండాలి
ఎండకాలంలో ప్రతీ వాహనదారుడు అప్రమత్తంగా ఉండాలి. వాహనాలను ఎండలో కాకుండా నీడలో పార్కింగ్ చేయాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల్లో టైర్లలో గాలి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. రీ బటన్ టైర్లను ఉపయోగించకూడదు. అదే విధంగా పెట్రోల్, డీజిల్‌ను ట్యాంక్ ఫుల్ చేయించొద్దు. బైక్‌లపై ఎండల్లో దూర ప్రయాణాలు చేయొద్దు.
– వి.వెంకటరమణ, ఇన్‌చార్జ్ ఆర్టీఓ
వాహనదారులు నీడలోనే పార్కింగ్ చేయాలి
ట్యాంక్ నిండా పెట్రోల్ నింపినా డేంజరే..
అధిక ఉష్ణోగ్రతలు ఉంటే దూర ప్రయాణం చేయొద్దు
అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు

ఎండల్లో బండ్లు జాగ్రత్త

ఎండల్లో బండ్లు జాగ్రత్త