సవాళ్లను స్వీకరించారు | - | Sakshi
Sakshi News home page

సవాళ్లను స్వీకరించారు

Apr 13 2025 12:33 AM | Updated on Apr 13 2025 12:33 AM

సవాళ్

సవాళ్లను స్వీకరించారు

● మైనింగ్‌ రంగంలో మహిళా ఇంజనీర్లు ● భూగర్భ గనుల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు ● సింగరేణిలో 38 మంది అధికారిణులు

పోలీస్‌ చేతిలో లాఠీలా ఈ మహిళల చేతిలో కనిపించే ఊత కర్రను బంటన్‌ స్టిక్‌ అంటారు. భూగర్భ గనుల్లోకి వెళ్లినప్పుడు ఈ కర్రతో పైకప్పును కొట్టడం ద్వారా ఆ ప్రదేశం పనికి అనుకూలంగా ఉంది లేనిది గుర్తిస్తారు. అయితే నిన్నామొన్నటి వరకు ఈ స్టిక్‌ పట్టుకునే హక్కు పురుషులదే. కఠినమైన పరిస్థితులు ఉండే భూగర్భ గనుల్లో ఈ పని చేయలేరంటూ ఈ అవకాశం మహిళలకు ఇవ్వలేదు. అదంతా కాలం చెల్లిన అభిప్రాయమని నిరూపిస్తున్నారు ఈ యంగ్‌ విమెన్‌ మైనర్స్‌.

–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

నో చాన్స్‌

దేశంలో బొగ్గు తవ్వకాలకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం పురుషులతో సమానంగా మహిళలకు గనుల్లో పని చేశారు. పని ప్రదేశాల్లో ఉండే కఠినమైన పరిస్థితులు, మహిళల భద్రత దృష్ట్యా స్వాతంత్య్రం వచ్చాక గనుల్లో మహిళలకు ఉద్యోగాలు కల్పించడంపై చట్టపరంగా నిషేధించారు. ఆ ప్రభావం సింగరేణిపై కూడా పడింది. దీంతో 2000 ఆరంభం వచ్చే సరికి నర్సులు, డాక్టర్లు, క్లరికల్‌ పోస్టులు తప్పితే మిగిలిన చోట్ల మహిళలకు అవకాశమే లేకుండా పోయింది. 2017 తర్వాత కారుణ్య నియామకాల ద్వారా మరికొందరికి అవకాశం దక్కినా అవి కూడా ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులకే పరిమితమయ్యాయి.

భిన్నమైన మార్గంలో

సింగరేణి బొగ్గు గనులను దృష్టిలో ఉంచుకుని 1970వ దశకంలో కొత్తగూడెంలో మైనింగ్‌ కాలేజీ ప్రారంభమైంది. దశాబ్దాల పాటు ఈ కాలేజీలో బాలికలకు ప్రవేశం ఇవ్వలేదు. 2013లో తొలిసారిగా ఇంజనీరింగ్‌ మైనింగ్‌ బ్రాంచిలో మహిళలకు ప్రవేశం కల్పించారు. తొలి బ్యాచ్‌లో ఐదుగురు, రెండో బ్యాచ్‌లో ఏడుగురు చేరారు. అలా చేరిన, ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కృష్ణవేణి అందరిలా కాకుండా సవాల్‌ విసిరుతూ మైనింగ్‌ రంగంలోకి వచ్చింది. బంధువులు, స్నేహితులు, లెక్చరర్లు, ప్రిన్సిపాల్‌ వరకు బ్రాంచి మార్చుకోవాలంటూ సూచించారు. కానీ ఐదుగురు బాలికలు స్థిరంగా నిలబడ్డారు. దీంతో మైనింగ్‌ కోర్సు మహిళలకు కూడా అనే భావనకు బలం వచ్చింది. ఆ మరుసటి ఏడాది బ్యాచ్‌లో కొత్తగూడెం పట్టణానికే చెందిన రమ్యశ్రీ చేరింది. చిన్నప్పటి నుంచి సింగరేణి వాతావరణంలో పెరగడంతో ఇందులోనే కెరీర్‌ ఎంచుకోవాలని నిర్ణయించింది. ఆ తర్వాత బ్యాచ్‌లో అనుపమ వచ్చి చేరింది. అలా మైనింగ్‌ కోర్సులో అడ్మిషన్లు తీసుకునే బాలికల సంఖ్య నిలకడగా ఉంటూ వస్తోంది. ఆ ఫలితంగానే కేఎస్‌ఎం, జేఎన్‌టీయూ (మంథని)తో పాటు మరో ఐదు ప్రైవేటు కాలేజీలు సైతం మైనింగ్‌ కోర్సును మహిళలకు ఆఫర్‌ చేస్తున్నాయి.

అడ్డంకులు దాటుకుని..

మహిళలు మైనింగ్‌ ఇంజనీరింగ్‌ చదవడమేంటనే మాటలు వింటూనే కోర్సు పూర్తి చేశారు. అప్పటికీ ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థల్లో మహిళా ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అయినా విమెన్‌ మైనింగ్‌ గ్రాడ్యుయేట్లు వెనక్కి తగ్గలేదు. ప్రైవేటు కంపెనీల్లో ఆఫర్లు వెతుక్కుంటూ పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాలకు వెళ్లారు. సాధారణంగా గనుల తవ్వకాలు జరిగే ప్రదేశాలు చాలా వరకు రిమోట్‌ ఏరియాలుగానే ఉంటాయి. రోడ్డు సౌకర్యం కూడా సరిగా ఉండదు. దుమ్ము ధూళి ఎక్కువ. ఎండా వానలు లెక్క చేయకుండా పని చేయాలి. దీనికి తోడు బయటి రాష్ట్రాల్లో ఉండే భాష, సంస్కృతి, ఆహారపు అలవాట్లు విభిన్నం. అయినా వారు వెరవలేదు. పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే మైనింగ్‌ ఇండస్ట్రీలో సమర్థంగా పని చేశారు. మైనింగ్‌ ఫీల్డ్‌ ఒక్కటే కాదు ఆహారం, సంస్కృతి, కాలుష్యం ఏవీ తమ పట్టుదల ముందు దిగదుడుపే అని నిరూపించారు.

సగర్వంగా నిలిచారు

గనుల్లో మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం తొలిసారిగా 2024లో జారీ చేసిన నోటిఫికేషన్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలుగా మహిళలకు సింగరేణి అవకాశం కల్పించింది. దీంతో ఒక్కసారే 38 మంది ఇంజనీర్లు గనుల్లో పని చేసే అవకాశం దక్కించుకున్నారు. వీరంతా సింగరేణిలోని వివిధ ఏరియాల్లో సమర్థంగా విధులు నిర్వహిస్తూ హమ్‌ కిసీ సే కమ్‌ నహీ అంటూ భవిష్యత్‌ తరాలకు బాటలు వేస్తున్నారు.

దృక్పథం మారాలి

ఒక అబ్బాయి ఏదైనా పని చేయడంలో విఫలమైతే కేవలం ఆ అబ్బాయి ఒక్కడే విఫలం అయ్యాడు అని అంటారు. అదే ఎవరైనా ఒక అమ్మాయి ఒక పని చేయడంలో తడబడితే చాలు, అమ్మాయిలంతా ఇంతే, ఏ పని చేయలేరంటూ ముద్ర వేస్తారు. ఈ ఆలోచన తీరులో మార్పు రావాలి. – కృష్ణవేణి

మొదట్లో వినేవాళ్లు కాదు

మేనేజ్‌మెంట్‌ ట్రైనీలుగా మా సూచనలు పాటించేందుకు కార్మికులు మొదట్లో సందేహించే వారు. మేము ఎంత విపులంగా చెప్పినా పురుష అధికారుల దగ్గరకు వెళ్లి కన్‌ఫర్మ్‌ చేసుకునే వాళ్లు. కానీ త్వరగానే మార్పు వచ్చింది. మహిళా అధికారులకు మద్దతు పెరిగింది.

– రమ్యశ్రీ

సవాళ్లను స్వీకరించారు1
1/2

సవాళ్లను స్వీకరించారు

సవాళ్లను స్వీకరించారు2
2/2

సవాళ్లను స్వీకరించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement