
విద్యుత్ అంతరాయాల తగ్గింపునకు చర్యలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): విద్యుత్ సరఫరాలో అంతరాయాల సమయం తగ్గించేందుకు 33 కేవీ, 11 కేవీ సుదూరమైన లైన్లలో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ జి.మహేందర్ తెలిపారు. ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. బ్రేక్‌డౌన్ సమయంలో, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక కారణాల వల్ల లైన్ మొత్తం తనిఖీ చేసే అవసరం లేకుండా విద్యుత్ అంతరాయం కలిగిన భాగాన్ని ఫాల్ట్ ఇండికేటర్ విభజిస్తుందని పేర్కొన్నారు. దీంతో అంతరాయం ఎక్కడ జరిగిందో వెంటనే విశ్లేషించి అక్కడికే వెళ్లి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. తద్వారా విద్యుత్ అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 17–33 కేవీ, 47–11 కేవీ విద్యుత్ ఫీడర్లలో ఫాల్ట్ ప్యాసెజ్ ఇండికేటర్లను బిగించేందుకు సాంకేతికంగా 33 కేవీ లైన్లలో 35, 11కేవీ లైన్లలో 122 ప్రదేశాలను గుర్తించామన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ మహేందర్