
ఆర్టీసీ.. ఆన్‌లైన్
సత్తుపల్లి టౌన్ : ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక బస్సుల్లో ప్రయాణికులు, కండక్టర్లు టికెట్ల సమయంలో ఎదుర్కొంటున్న చిల్లర సమస్యలకు తెరపడనుంది. ఖమ్మం రీజియన్‌లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం ఆర్టీసీ డిపోల్లోని రిజర్వేషన్ బస్సుల్లో ఐ–టిమ్స్‌ను ప్రవేశపెట్టారు. రీజియన్‌లో 530 బస్సులు ఉండగా.. 40 రాజధాని బస్సులు, 75 సూపర్‌లగ్జరీ బస్సులు, 10 లహరి బస్సుల్లో తొలివిడతగా డిజిటల్ చెల్లింపు విధానం ప్రారంభమైంది.
నూతన సాఫ్ట్‌వేర్ అనుసంధానంతో..
రిజర్వేషన్ బస్సుల్లో ఉన్న పాత టిమ్‌ల స్థానంలో ప్రస్తుతం ఛలోయాప్ పేరిట నూతన సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేసిన కొత్త ఐ–టిమ్ మిషన్(ఇంటర్‌నెట్ టికెట్ ఇస్యూ యింగ్ మిషన్)లు అందుబాటులోకి వచ్చాయి.
క్యూఆర్ కోడ్‌తో..
ఈ బస్సుల్లో టిమ్ మిషన్‌లోని క్యూఆర్ కోడ్‌ను ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి మొబైల్ యాప్‌లతో స్కానింగ్ చేసి నేరుగా టికెట్ చార్జీలను చెల్లించవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించే విధంగా ఆధునిక టిమ్ యంత్రాలను రిజర్వేషన్ బస్సుల్లో ప్రవేశపెట్టారు. త్వరలో రీజియన్‌లోని ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో సైతం ఈ నగదు రహిత చెల్లింపు విధానం అమలుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది.
డిపో ఐ – టిమ్స్
బస్సులు
సత్తుపల్లి 22
ఖమ్మం 43
కొత్తగూడెం 08
భద్రాచలం 31
మణుగూరు 22
మధిర 07
క్యూ ఆర్ కోడ్‌తో బస్సుల్లో చెల్లింపులు
రిజర్వేషన్ బస్సుల్లో అందుబాటులోకి ఐ – టిమ్స్
డిజిటల్ చెల్లింపులతో నగదు లేకున్నా బేఫికర్
అన్ని బస్సుల్లో అమలు చేస్తాం
డిజిటల్ పేమెంట్లతో ఐ టిమ్ మిషన్లను రిజర్వేషన్ బస్సుల్లో ప్రవేశపెట్టాం. ఇది ప్రయాణీకులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. చిల్లర సమస్య ఉండదు. ఏ సర్వీస్‌లో ఎన్ని సీట్లు ఉన్నాయో, ప్రతీది రికార్డ్ అవుతుంది. నగదుతో పాటు, నగదు రహిత సేవలను అన్ని బస్సుల్లో అమలు చేస్తాం.
– సరిరామ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, ఖమ్మం

ఆర్టీసీ.. ఆన్‌లైన్

ఆర్టీసీ.. ఆన్‌లైన్