
వణికిస్తున్న వరుణుడు
ఉరుములు మెరుపులతో
భారీ వర్షం
పాల్వంచరూరల్/అశ్వాపురం/గుండాల/చండ్రుగొండ/దుమ్ముగూడెం: పలుచోట్ల ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనేక చోట్ల రాళ్లు పడ్డాయి. గాలిదుమారానికి పంటలు దెబ్బతిన్నాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడవకుండా రైతులు పరదాలు కప్పి ఉంచారు. కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించకపోవడంతో చేతికి వచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలిదుమారంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాల్వంచ మండలం సోములగూడెం, జగన్నాథపురం, నాగారం, పాండురంగాపురం, రెడ్డిగూడెం తదితర గ్రామాల్లో వర్షం కురవడంతో వీధుల్లో వరద ప్రవహించింది. చండ్రుగొండ మండలంలో కోత దశలో ఉన్న మామిడి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. మామిడి కాయలు నేలరాలాయి. ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో రాళ్ల వర్షం కురిసింది. గాలిదుమారానికి మొక్కజొన్న చేన్లు నేలవాలాయి. గత వర్షాలకు నేలమట్టమైన మొక్కజొన్న చేన్లు ఇప్పుడిప్పుడే కొద్దిగా పైకి లేస్తున్నాయని, మళ్లీ గాలి దుమారంతో పూర్తిగా పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులకు దుమ్ముగూడెం మండలంలోని శ్రీనగర్ కాలనీ గ్రామానికి చెందిన జిలకర రమేష్ రేకులషెడ్డు ఇల్లు కూలి పడి ముగ్గురికి గాయాలయ్యాయి. ఈదురుగాలులు, వర్షానికి అశ్వాపురం మండలం తుమ్మలచెరువు ఆయకట్టు కింద కోతకు వచ్చిన వరిపొలాలు నేలవాలాయి.
బూర్గంపాడు: యాసంగి పంట చేతికి వచ్చే సమయంలో అన్నదాతలను వరుణుడు వణికిస్తున్నాడు. పదిరోజులుగా జిల్లాలో ఏదో ప్రాంతంలో గాలి దుమారంతో కూడిన వానలు పడుతున్నాయి. ప్రస్తుతం యాసంగి వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా, కోసిన ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెడుతున్నారు. రోజూ సాయంత్రం వాన పడుతుండటంతో ఆరబోసిన ధాన్యం కుప్ప నూర్పి పరదాలు కప్పి కాపాడుకుంటున్నారు. మళ్లీ ఉదయం ఆరబోసుకుంటున్నారు. పగలంతా తీవ్రమైన ఎండలు, సాయంత్రం గాలి దుమారంతో కూడిన వర్షాలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలుగా తరలిద్దామంటే తేమశాతం ఎక్కువగా ఉందని, అక్కడ కొనుగోళ్లు జరగటం లేదు. దీంతో విసుగు చెంది రైతులు తక్కువ ధరలకే మిల్లర్లకు, వ్యాపారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం గాలి దుమారంతో కూడిన వాన పడింది. పాల్వంచ, గుండాల, కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు తదితర మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం కురిసింది. అశ్వాపురం మండలంలో కొన్నిచోట్ల వడగాళ్ల వానలు కూడా పడ్డాయి. రైతులు కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులతో వెళ్లి టార్పాలిన్లు కప్పుకున్నారు. బూర్గంపాడు మార్కెట్‌యార్డులో ఆరబెట్టిన ధాన్యంపై వర్షంలోనే పరదాలు కప్పుకున్నారు. యార్డులోని సిమెంట్ ప్లాట్‌ఫామ్‌లపై వచ్చే వరదను రాశుల కిందకు రాకుండా వరిపొట్టుతో కట్టలు వేసుకున్నారు.
జిల్లాలో పది రోజులుగా గాలివానలు
ముమ్మరంగా సాగుతున్న వరికోతలు
ధాన్యం కాపాడుకునేందుకు
అన్నదాతల ఉరుకులు పరుగులు

వణికిస్తున్న వరుణుడు

వణికిస్తున్న వరుణుడు

వణికిస్తున్న వరుణుడు