
ఆన్‌లైన్ అవస్థలు..
కొత్తగూడెంఅర్బన్: నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని గత నెల ప్రారంభించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. ఈ పథకం కింద అర్హులైన వారికి రూ.4 లక్షల వరకు రుణం అందించనున్నారు. బ్యాంకులతో లింకేజీ అయిన రుణాలు, లింకేజీ లేకుండా మరికొన్ని రుణాలను అందించనున్నారు. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు గానూ సోమవారంతో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియనున్నది. దీంతో దరఖాస్తులు ఇంకా చేయకుండా అర్హత ఉన్న వారు మీసేవ, ఆన్‌లైన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. మూడు రోజులుగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన సర్వర్ పూర్తిగా డౌన్ అయింది. కొన్ని సందర్భాల్లో అసలు ఓపెన్ కూడా కావడం లేదు. వివరాలన్నీ నమోదు చేసిన తరువాత సబ్‌మిట్ చేస్తే అప్రూవ్ రావడానికి ఒక్కో దరఖాస్తుకు గంట నుంచి రెండు గంటలు పడుతోంది. దరఖాస్తు అప్రూవ్ అయితే వివరాలకు సంబంధించి వారి సెల్‌కు సమాచారం వస్తుంది. అందుకు ఎక్కువ సమయం పడుతుండటంతో దరఖాస్తుదారులంతా ఎప్పడు మెసేజ్ వస్తుందోనని మీసేవ, ఆన్‌లైన్ సెంటర్లలో పగలు, రాత్రి తేడా లేకుండా వేచిచూస్తున్నారు. సర్వర్ డౌన్ కావడం, ఒక్క దరఖాస్తుకు గంటల తరబడి సమయం పడుతుండటంతో ఆయా సెంటర్ల నిర్వాహకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా చాలామంది రాజీవ్ యువ వికాసం పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఇష్టపడడం లేదు. కొన్ని సెంటర్ల వారు ఆన్‌లైన్ చేయడం లేదని తేల్చిచెబుతుండటంతో ఇతర సెంటర్లకు పరుగులు పెడుతున్న పరిిస్థితి ఉంది. ఒక్క దరఖాస్తు ఆన్‌లైన్ చేయడానికి సెంటర్ల వారు రూ.100 వసూలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మళ్లీ రాత్రి 11 గంటల తరువాత సర్వర్ వేగంగా పనిచేస్తోందని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్వర్ ఇబ్బంది పెట్టడం వల్ల అర్హత కలిగిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
కార్యాలయాల్లో ఇవ్వాల్సిందే..
రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి సర్వర్ డౌన్ కావడం వల్ల కొందరు సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసి అడిగితే.. ఆన్‌లైన్ కాకపోయినా కూడా వారి దరఖాస్తులను ధ్రువపత్రాలతో కలిపి పట్టణం అయితే మున్సిపాలిటీలు, మండలం అయితే ఎంపీడీఓ కార్యాలయాల్లో ఇవ్వాలని సూచిస్తున్నారు. కానీ, అధికారికంగా ప్రకటనలు మాత్రం విడుదల చేయడం లేదు. దీంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. ఆన్‌లైన్ చేయకపోతే అసలు దరఖాస్తును పరిగణనలోకి తీసుకోరనే అనుమానం దరఖాస్తుదారుల్లో వ్యక్తమవుతోంది. అసలు పథకంపై అవగాహన కల్పించడంలో కూడా సంబంధిత అధికారులు విఫలం చెందారని, ప్రభుత్వ లక్ష్యం నీరుగారే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. సర్వర్ డౌన్ కారణంగా చాలామంది దరఖాస్తు చేసుకోవడానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని, గడువును పెంచి, ఆ సమయంలో పథకంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందని పలువురు సూచిస్తున్నారు.
‘రాజీవ్ యువ వికాసం’దరఖాస్తుకు బారులు
సర్వర్ డౌన్‌తో గంటల తరబడి నిరీక్షణ
నేటితో ముగియనున్న గడువు
జిల్లాలో వచ్చిన దరఖాస్తులు..
జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. రుణాల కోసం వ్యవసాయ రంగాలకు చెందిన వారు అయితే 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు, వ్యవసాయేతర రంగాలకు చెందిన రుణాలకు అయితే 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని అధికారులు తెలిపారు. అయితే రుణాలకు సంబంధించి ముఖ్యమైన 75 రకాల స్కీంలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే శనివారం వరకు జిల్లాలో ఎస్సీ – 9,746, బీసీ – 16,632, మైనార్టీ – 13,655 దరఖాస్తులు వచ్చినట్లు ఆయా శాఖల అధికారులు వెల్లడించారు. సోమవారం చివరి రోజు కావడంతో దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది.