
శిశుగృహకు కవల ఆడపిల్లలు
చింతకాని: కవల ఆడ శిశువుల అదృశ్యంపై ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. దత్తత తీసుకున్న వారి నుంచి ఐసీడీఎస్, చైల్డ్‌లైన్ అధికారులు శిశువులను చేరదీసి ఖమ్మంలోని శిశుగృహకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. చింతకాని మండలం నాగులవంచ రైల్వే కాలనీకి చెందిన నల్లగాజు మల్లేశ్–ఉమ దంపతులకు గతంలో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా గత నెల 31న ఉమ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కవల ఆడ శిశువులకు జన్మనిచ్చింది. దీంతో వారిని పోసించడం భారంగా భావించిన మల్లేశ్.. ఆస్పత్రిలోనే వేర్వేరు కుటుంబాల వారిని దత్తత ఇచ్చాడు. అయితే, శిశువు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు వారి ఇంటికి వెళ్లిన ఆశ కార్యకర్త, అంగన్‌వాడీ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించగా ఈనెల 11న అధికారులు మల్లేష్ ఇంటికి అధికారులు వెళ్లి విచారణ చేపట్టారు. పిల్లల్ని పోషించలేని స్థితిలో తమ బంధువులకే దత్తత ఇచ్చామని మల్లేశ్ సమాధానం చెప్పాడు. కానీ నిబంధనలకు విరుద్ధంగా దత్తత ఇవ్వడంతో చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా సోమవారం నాటికి శిశువులను తీసుకొస్తానని లేఖ రాసి ఇచ్చాడు.
ఆ కుటుంబాల నుంచి స్వాధీనం
ఆడశిశువులు ఇద్దరిని పిల్లలు లేని తమ దగ్గరి బంధువులకే ఇచ్చామని మల్లేశ్ అధికారులను నమ్మించాడు. ఎట్టి పరిస్థితుల్లో వారిని రప్పించాలని సూచించిన అధికారులు విచారణ చేపట్టగా పిల్లలను ఖమ్మంలోని ఇద్దరు వేర్వేరు దంపతులకు దత్తత ఇచ్చినట్లు తేలింది. ఈక్రమాన డబ్బు చేతులు మారినట్లు ప్రచారం జరిగినా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇక సోమవారం దత్తత తీసుకున్న వారి నుంచి శిశువులను మల్లేశ్ దంపతులు తీసుకురాగా, వారి ఇంటికి ఐసీడీఎస్, చైల్డ్‌లైన్ అధికారులు వెళ్లి పిల్లలను పోసిస్తారా, తమకు అప్పగిస్తారా అని ప్రశ్నిస్తే తామే పోషిస్తామని సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నందున దంపతులు పోషిస్తారనే నమ్మకం లేకపోవడంతో మల్లేశ్ దంపతులు, శిశువులను ఖమ్మంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచారు. కమిటీ చైర్‌పర్సన్ కౌన్సెలింగ్ ఇచ్చాక శిశువులను శిశుగృహలో ఉంచాలని నిర్ణయించారు.
దత్తత తీసుకున్న వారి నుంచి స్వాధీనం