
పోలీస్ స్టేషన్ ఎదుట మహిళల ఆందోళన
కొత్తగూడెంటౌన్: తనపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారని ఆరోపిస్తూ ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం జరిగే వరకు కదలనని భీష్మించింది. బాధితురాలు కొర్రా నిరోష మాట్లాడుతూ.. సూజాతనగర్ మండలం సర్వారం నందతండాకు చెందిన తన భర్త కానిస్టేబుల్ అని, తమ మధ్య గొడవలు ఉన్నాయని తెలిపింది. ఈ క్రమంలో మరో మహిళతో కావాలని తనపై ఏప్రిల్ 11న అక్రమ కేసు పెట్టించారని, తన భర్త డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుండటంతో తనకు పోలీసులు మద్దతు ఇవ్వడం లేదని ఆరోపించింది. ఈ విషయమై టూటౌన్ సీఐ రమేశ్‌కుమార్‌ను వివరణ కోరగా ఏప్రిల్ 11వ తేదీన రామవరానికి చెందిన మహిళ తనను కొర్ర నీరజ కొట్టిందని కేసు పెట్టిందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని, నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందన్నారు.
అక్రమంగా కేసు పెట్టారంటూ ఆరోపణ