నాసిరకం విత్తనం..రైతు పతనం.. | - | Sakshi
Sakshi News home page

నాసిరకం విత్తనం..రైతు పతనం..

Apr 16 2025 12:17 AM | Updated on Apr 16 2025 12:17 AM

నాసిర

నాసిరకం విత్తనం..రైతు పతనం..

రైతులను నిండా ముంచిన మొక్కజొన్న
● నాణ్యత లేని విత్తనాలతో బెండు కంకులు ● లబోదిబోమంటున్న రైతులు ● ముఖం చాటేస్తున్న విత్తన కంపెనీ డీలర్లు, ఆర్గనైజర్లు, ఏజెంట్లు

జూలూరుపాడు: పలు కంపెనీలకు చెందిన ఆడ, మగ మొక్కజొన్న విత్తనాలు రైతులను నిండా ముంచాయి. మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆడ, మగ మొక్కజొన్న పంటను సుమారు 1000 ఎకరాల్లో సాగు చేయగా.. వినోభానగర్‌లో 400 ఎకరాల్లో పంట వేశారు. విత్తనాలు వేసే సమయంలో వివిధ కంపెనీల డీలర్లు, ఆర్గనైజర్లు, ఏజెంట్లు రైతులకు మాయమాటలు చెప్పి పంటను కొనుగోలు చేస్తామని, పంట పండకపోతే పరిహారంగా రూ.75,000 నుంచి రూ.80 వేలు ఇస్తామని, పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.20,000ల నుంచి రూ.30,000 నగదు ఇవ్వడం, ఎకరానికి 3.5 – 4 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని, మెట్రిక్‌ టన్నుకు రూ.33,000 నుంచి రూ.35,000 ఇస్తామని, ఎకరానికి రూ.లక్ష లాభం వస్తుందని నమ్మబలికారు. 90 – 100 రోజుల్లో పంట చేతికి వస్తుందని ఆశపడిన రైతులు ఆడ, మగ మొక్కజొన్న పంటను సాగు చేశారు. కంపెనీల ప్రతినిధులు కొందిరికి ఒప్పంద పత్రాలు ఇచ్చి.. మరికొందరికి ఇవ్వకుండా దాటవేశారు. రైతులకు పెట్టుబడి సాయంగా కంపెనీ వారు ఇచ్చిన నగదుకు సంబంధించి ఖాళీ ప్రామిసరీ నోట్‌పై సంతకాలు తీసుకున్నారు. మూడు నెలల్లో ఏపుగా పెరిగిన మొక్కజొన్న మొక్కలకు విత్తనాలు లేని బెండు కంకులు వచ్చాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. వినోభానగర్‌లో సుమారు 150 ఎకరాల్లో పంట దెబ్బతినడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. డీలర్లు, ఆర్గనైజర్లు, ఏజెంట్లకు ఫోన్‌ చేస్తే తమకు ఏమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఫోన్‌ కూడా ఎత్తడం లేదని, గట్టిగా నిలదీస్తే ఏమైనా చేసుకోండంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. తాము సంతకాలు చేసిన ఖాళీ ప్రామిసరీ నోట్లు సంబంధిత కంపెనీలకు చెందిన డీలర్లు, ఆర్గనైజర్లు, ఏజెంట్ల వద్ద ఉండటం ఆందోళన కల్గిస్తోందని రైతులు వాపోతున్నారు. సంబంధిత మొక్కజొన్న కంపెనీలపై వ్యవసాయశాఖ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా, మండల వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆడ, మగ మొక్కజొన్న పంటలను పరిశీలించి, న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

ఖాళీ ప్రామిసరీ నోట్‌పై

సంతకం పెట్టా..

ఓ విత్తన కంపెనీ వారు ఆడ, మగ మొక్కజొన్న పంట సాగుకు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.20 వేలు చొప్పు న 5.5 ఎకరాలకు డబ్బులు ఇచ్చారు. నగదు ఇచ్చిన తరువాత ఖాళీ ప్రాంసరీ నోట్‌పై సంతకం పెట్టి కంపెనీ ఆర్గనైజర్‌కు ఇచ్చాను. కంపెనీ ఆర్గనైజర్‌ చెప్పిన మాయమాటలు విని పత్తి పంటను తొలగించి ఆడ, మగ మొక్కజ్నొ పంట సాగుచేస్తే విత్తనాలు లేని బెండు కంకులు రావడంతో తీవ్రంగా నష్టపోయాను.

–గంగావత్‌ లక్ష్మణ్‌, రైతు వినోభానగర్‌

పరిహారం ఇస్తామని చెప్పారు..

ఆడ, మగ మొక్కజొన్న పంట పండకపోతే నష్ట పరిహారంగా ఎకరానికి రూ.80 వేలు ఇస్తామని చెప్పారు. కంపెనీ డీలర్లు, ఆర్గనైజర్లు, ఏజెంట్లకు ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయడం లేదు. పలుమార్లు ఫోన్‌ చేస్తే గానీ లిఫ్ట్‌ చేస్తున్నారు. కానీ, నష్ట పరిహారం గురించి మాట్లాడటం లేదు. ఈ అంశంపై వ్యవసాయశాఖ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాం. విత్తన కంపెనీలపై ఇప్పటికై నా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలి.

–భూక్యా బాలు, రైతు, వినోభానగర్‌

అధిక దిగుబడి వస్తుందని నమ్మించారు..

ఓ కంపెనీకి చెందిన విత్తనాలు వేస్తే బెండు కంకులు రావడంతో తీవ్ర నష్టం వచ్చింది. 40 శాతం పండి 60 శాతం పండకపోతే ఎకరానికి రూ.80 వేలు ఇస్తామని చెప్పారు. విత్తనకంపెనీ వారు నాణ్యతలేని విత్తనాలు ఇచ్చి మోసం చేశారు. బాండు పేపర్‌ రాసి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.20 వేలు ముందుగా ఇచ్చి ఖాళీ ప్రాంసరీ నోట్‌పై సంతకం పెట్టించుకొని తీసుకున్నారు. ఇప్పుడు ప్రాంసరీ నోట్‌ అడిగితే ఇవ్వడం లేదు.

–భూక్యా రాంబాబు, రైతు, వినోభానగర్‌

టేకులపల్లిలో..

టేకులపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో ఓ విత్తన కంపెనీ ప్రతినిధులు ఆడ, మగ మొక్కజొన్న విత్తనోత్పత్తి కోసం రైతులకు సాగు ఖర్చులు ఇచ్చి పంట పండిన తరువాత కొనుగోలు చేస్తామని రైతులతో ఒప్పందం చేసుకున్నారు. మంగళితండాకు చెందిన ఆంగోతు సేవ్యా 10 ఎకరాలు, తేజావత్‌ పూల్‌సింగ్‌ ఎకరం, దారావత్‌ నాగ రెండున్నర, తేజావత్‌ దళ్‌సింగ్‌ 3, లాకావత్‌ రాజు 2, లాకావత్‌ రాజేశ్‌ ఒకటి, రెడ్డి 3, శంకర్‌ 3, గుగులోత్‌ రాంజీ ఒకటి, కోటేశ్వర్‌రావు 2, మోతీలాల్‌ 7, నారాయణ 2, భూక్య రాములు 2, భూక్య దశరథ్‌ 7.. చుక్కాలబోడు, గోలియాతండా తదితర గ్రామాలకు చెందిన సుమారు వందకుపైగా రైతులు 1,500కు పైగా ఎకరాల్లో ఆడ, మగ మొక్కజొన్న సాగు చేశారు. పంట దెబ్బతింటే ఎకరానికి రూ.70 వేలు, పండితే క్వింటాకి రూ.2,600 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పారు. ఒప్పందం ప్రకారం ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో సాగు ఖర్చు కోసం రూ.20 వేలు వేసింది. రైతులు సాగు చేశారు. మూడు నెలల్లో రావాల్సిన పంట నాలుగు నెలలు పట్టిందని, అది కూడా కంకి పూత, కాత సరిగా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రైతులు పంటను కోసి సిద్ధంగా ఉంచారని కంపెనీ ప్రతినిధులకు ఫోన్‌ చేస్తే రావడం లేదని, స్పందించడం లేదని వాపోయారు. నమ్మించి ఆశ పెట్టి తీరా పంట పాడైతే కంపెనీ ప్రతినిధులు స్పందించడం లేదని, ఇప్పటికే వేల రూపాయలు, శ్రమ పోయిందని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.

నాసిరకం విత్తనం..రైతు పతనం.. 1
1/4

నాసిరకం విత్తనం..రైతు పతనం..

నాసిరకం విత్తనం..రైతు పతనం.. 2
2/4

నాసిరకం విత్తనం..రైతు పతనం..

నాసిరకం విత్తనం..రైతు పతనం.. 3
3/4

నాసిరకం విత్తనం..రైతు పతనం..

నాసిరకం విత్తనం..రైతు పతనం.. 4
4/4

నాసిరకం విత్తనం..రైతు పతనం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement