
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
సమ్మక్క బ్యారేజీ నుంచి నీరు విడుదల
సూపర్‌బజార్(కొత్తగూడెం)/అశ్వాపురం : జిల్లాలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచి నీరు విడుదల చేయనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం తెలిపారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీరు అడుగంటుతోందని, దీంతో రానున్న రోజుల్లో తాగునీటికి ఇబ్బంది కలుగకుండా మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో తుపాకులగూడెంలోని బ్యారేజీ నుంచి 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని వివరించారు. ఏప్రిల్, మే నెలల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
భద్రాద్రి తలంబ్రాలకు
ఆదరణ
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను కొనుగోలు చేసే భక్తుల సంఖ్య ఈ ఏడాది భారీగా పెరిగింది. శ్రీరామనవమికి భద్రాచలం రాలేని భక్తుల ఇంటివద్దకే తలంబ్రాలు అందించాలని ఆర్టీసీ కార్గో సంకల్పించింది. గత నెల 15 నుంచి ఈనెల 7 వరకు రూ.151 చెల్లించి బుక్ చేసుకున్న వారికి కార్గో సిబ్బంది తలంబ్రాలు అందించారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా బుక్ చేసుకున్నారు. గతేడాది ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా 4,500 మంది మాత్రమే బుక్ చేసుకోగా ఆర్టీసీకి రూ.6.79 లక్షల ఆదాయం వచ్చింది. ఈసారి 4,948 మంది బుక్ చేసుకోగా రూ.7.47 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా గల 11 ఆర్టీసీ రీజియన్లలో పరిధిలో 2024లో 47,092 బుకింగ్‌లకు రూ.71,10,892 ఆదాయం రాగా, ఈ ఏడాది 82,147 మంది బుక్ చేసుకున్నారు. వీటిలో ఇప్పటివరకు 40 వేల తలంబ్రాల ప్యాకెట్లు కార్గో ద్వారా అందజేయగా రూ.60.40 లక్షల ఆదాయం వచ్చింది. ఇంకా 42 వేల మంది భక్తులకు త్వరలోనే తలంబ్రాలు అందిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం