పంచాయతీ సిబ్బంది సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ సిబ్బంది సస్పెన్షన్‌

Published Sat, Apr 19 2025 12:19 AM | Last Updated on Sat, Apr 19 2025 12:19 AM

పంచాయతీ సిబ్బంది సస్పెన్షన్‌

పంచాయతీ సిబ్బంది సస్పెన్షన్‌

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం గ్రామ పంచాయతీలో ఓ అధికారి సరైన విచారణ చేయకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బేస్‌మెంట్‌ లేని లబ్ధిదారులను ఆన్‌లైన్‌లో నమోదు చేశాడని ఆధునిక సాంకేతిక విచారణలో తేలింది. దీంతో పూసా జగదీష్‌ను కలెక్టర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం విధుల నుంచి తొలగించారు. ఎక్కడైనా ఇలాంటి పొరపాట్లలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

పోలీసుల సోదాలు

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం రామాలయం పరిసర ప్రాంతాల్లోని బెల్ట్‌ షాపుల్లో శుక్రవారం భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్‌ ఆధ్వర్యాన పట్టణ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు బెల్ట్‌ షాపుల్లో నిల్వ ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని స్థానిక ఎకై ్సజ్‌ శాఖ సీఐ షేక్‌ రహీమున్నీసా బేగంకు అప్పగించారు. అనంతరం పట్టణంలోని మూడు లాడ్జీలలో ఏఎస్పీ విక్రాంత్‌, తన సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకముందు అంబేడ్కర్‌సెంటర్‌లో వాహనాలు తనిఖీ నిర్వహించి ట్రాఫిక్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ మధుప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మానవ హక్కుల సంఘం జిల్లా కార్యదర్శిగా రమేష్‌

మణుగూరు రూరల్‌: జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా కార్యదర్శిగా బీర రమేష్‌ను, మండల చైర్మన్‌గా భోగ వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి వాకపల్లి ప్రవీణ్‌బాబు నియమితులయ్యారు. శుక్రవారం మణుగూరులో నిర్వహించిన సమావేశంలో నియామక పత్రాలు అందజేశారు. జిల్లా చైర్మన్‌ ధూళిపూడి శివప్రసాద్‌, జిల్లా కార్యదర్శి లింగంపల్లి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్‌..

పాల్వంచరూరల్‌: ద్విచక్రవాహనాన్ని వ్యాన్‌ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామ పంచాయతీ ధర్మన్ననగర్‌ చెందిన మడవి మున్నా, అతడి మేనల్లుడు కోర్స సురేష్‌లు శుక్రవారం ద్విచక్రవాహనంపై పాల్వంచకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో జగన్నాధపురం గ్రామ శివారు తోగ్గూడెం రోడ్డులో పాల్వంచ వైపు వస్తున్న వ్యాన్‌ ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్లున్న ఇద్దరికి తీవ్ర గాయలు కాగా 108లో స్థానిక ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెం ఏరియా, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మడవి నందా ఫిర్యాదు మేరకు చండ్రుగొండ మండలం రేపల్లేవాడకు చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ ఇనుము నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు.

బాలుడిని ఢీకొట్టిన ట్రాక్టర్‌..

జూలూరుపాడు: రోడ్డు దాటుతున్న ఓ బాలుడిని ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో కాలు విరిగిన సంఘటన మండలంలోని భేతాళపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు నాగమల్లిఖార్జున్‌, త్రివేణి దంపతుల మూడేళ్ల కుమారుడు సిద్దు ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఊళ్లో రాత్రి పూట అక్రమంగా మట్టి తోలకాలు జరుపుతున్న ఓ ట్రాక్టర్‌ బాలుడిని ఢీకొట్టి కాలుపై నుంచి ట్రాక్టర్‌ ముందు టైర్‌ వెళ్లడంతో విరిగిపోయింది. ఈమేరకు సిద్దును కొత్తగూడెం ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌ తరలించారు.

చోరీపై కేసు నమోదు

దమ్మపేట: దమ్మపేట గ్రామానికి చెందిన తాండ్ర నరసింహారావు రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి ఊరెళ్లి శుక్రవారం ఉదయం ఇంటికొచ్చాడు. ఈక్రమంలో ఇంటి తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోపలికి వెల్లగా రూ.20 వేల విలువైన వెండి వస్తువులు చోరీ అయినట్లు గుర్తించాడు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికిషోర్‌రెడ్డి తెలిపారు.

భూ వివాదంలో పలువురిపై..

అశ్వాపురం: మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో ఇటీవల భూ వివాదంలో అశ్వాపురం సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యాన గురువారం రాత్రి పలువురిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో 190/1 సర్వే నంబర్‌లో ఎకరం 20 కుంటల భూమికి సంబంధించి ఎన్నో ఏళ్లుగా భూమి గ్రామకంఠానిదని రెవెన్యూ అధికారులు కూడా సర్వే చేపట్టి మాకు ఇచ్చారని గ్రామస్తులు, తాతల కాలంగా మా కుటుంబానికి చెందిందని హరిప్రసాద్‌ కుటుంబసభ్యులకు గత కొన్నేళ్లుగా వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యాన ఇటీవల హరిప్రసాద్‌ తన అనుచరులతో జేసీబీతో భూమి చుట్టూ ఫెన్షింగ్‌ వేసేందుకు రాగా రామచంద్రాపురం గ్రామస్తులకు, సారపాకకు చెందిన కొందరికి ఘర్షణ జరిగి దాడులు చేసుకున్నారు. గురువారం సామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఐటీసీ టీఎన్‌టీయూసీ నాయకుడు కనకమేడల హరిప్రసాద్‌తో పాటు ఐటీసీ ఉద్యోగులు, మరికొందరు 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హరిప్రసాద్‌ ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఏడుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement