
వన్యప్రాణి వధ!
నాటు తుపాకులతో సాగుతున్న వేట ● నీటి స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్న వేటగాళ్లు ● కొందరు అటవీ అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ● ఫిర్యాదులు అందితేనే దాడులు.. అరెస్ట్‌లోనూ తాత్సారం
వేడుక చూస్తున్న
అటవీశాఖాధికారులు
వేటగాళ్లు ఉచ్చులు, నాటు తుపాకులు, వలలతో వేటాడుతున్నా అటవీ శాఖాధికారులు మాత్రం వేడుక చూస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అడవుల్లో పులులు, ఇతర జంతువుల సంచారాన్ని రికార్డు చేసేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలు జంతువుల జాడను గుర్తిస్తున్నాయి కానీ వేటగాళ్ల జాడను మాత్రం గుర్తించలేక పోతున్నాయా? లేక సీసీ కెమేరాల ఆధారంగా జంతువుల జాడను అటవీ శాఖలో పనిచేస్తున్నవారు వేటగాళ్లకు సమాచారం అందిస్తున్నారా..? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ నెల 9న తుపాకులతో అడవిలో సంచరించిన వ్యక్తులకు ఓ బీట్ ఆఫీసర్‌కు మధ్య లావాదేవీలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అంతా సార్‌కు తెలిసే జరిగిందని అనుకున్నారు. తాజాగా దమ్మపేట రేంజ్‌లో దుప్పి మాంసం పట్టుబడగా రెండు రోజుల జాప్యం అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలపై పాల్వంచ ఎఫ్‌డీఓ దామోదర్‌రెడ్డిని వివరణ కోరగా.. వన్యప్రాణులను వధిస్తే నిందితులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అడవిలో గస్తీ నిర్వహించేందుకు సిబ్బంది కొరత ఉందని, సీసీ కెమెరాలు కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయని వివరించారు.
అశ్వారావుపేట: వేసవి కాలం కావడంతో వన్యప్రాణులను వేటాడుతున్నారు. జిల్లాలో సీతారామ కాలువల నిర్మాణం ప్రారంభమయ్యాక అడవుల్లోకి నేరుగా మార్గాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు వేసవిలో కాలువల్లో నీళ్లు తాగేందుకు జింకలు, ఇతర వన్య మృగాలు వస్తుండటంతో కాలువల సమీప ప్రాంతాలు వేటగాళ్లకు లక్ష్యంగా మారాయి. అడవుల్లో జంతువులు దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన సాసర్‌పిట్లను కూడా లక్ష్యంగా చేసుకున్ని వన్యప్రాణులను వధిస్తున్నారు. ఏటా శీతాకాలం చివరిలో సుదూర ప్రాంతాల నుంచి జిల్లాలోని పలు అటవీ ప్రాంతాలకు వేటకు వస్తుంటారు. తుపాకులతో వేటాడం, ఉచ్చులు పెట్టడం, విద్యుత్ వైర్లు అమర్చడం, వలలు అమర్చడం వంటి విధానాల్లో వేట జరుగుతుండేది. విద్యుత్ వైర్లు తగిలి వేటగాళ్లే మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. దీంతో విద్యుత్ వైర్లు అమర్చడం తగ్గించారు. కొద్దిరోజులుగా నాటు తుపాకులతో అటవీ జంతువులను వేటాడుతున్నారు. కొన్ని చోట్ల ఉచ్చులు, వలలు కూడా వినియోగిస్తున్నారు. అశ్వారావుపేట, దమ్మపేట రేంజ్‌లలోని అటవీ ప్రాంతాలు, చంద్రుగొండ మండలం కనకగిరి గుట్టలు, అన్నపురెడ్డిపల్లి అటవీ ప్రాంతాలు, పాల్వంచ మండలం, ఇల్లెందు నియోజకవర్గం గుండాల, పూబెల్లి, పూసపల్లి, బేతంపూడి ప్రాంతం, బీటీపీఎస్ పరిసర ప్రాంతాల్లో జంతువుల వేట జరుగుతున్నట్లు సమాచారం. అటవీ శాఖ నిబంధనలు కట్టుదిట్టంగా ఉన్నా వేటగాళ్లు వెనక్కు తగ్గటంలేదు.
పాల్వంచ డివిజన్‌లో వరుస ఘటనలు..
ఈ నెల 9న పాల్వంచ ఫారెస్ట్ డివిజన్‌లోని అశ్వారావుపేట రేంజ్ కంట్లం బీట్‌లో ఏపీకి చెందిన కొందరు వ్యక్తులు తుపాకులతో అడవిలో సంచరిస్తుండగా బేస్ క్యాంపు సిబ్బంది పట్టుకుని కేసు నమోదు చేశారు. గడిచిన వారం రోజుల్లో దమ్మపేట మండలంలో దుప్పి మాంసం పంపిణీ జరిగినట్లు ప్రచారం జరిగింది. స్థానికుల ఫిర్యాదుతో గత గురువారం దమ్మపేట మండలం చెన్నువారిగూడెం గ్రామంలో అటవీ అధికారులు దాడులు చేసి దుప్పి మాంసం, చర్మం స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల తాత్సారం తర్వాత శనివారం నలుగురిపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనలో ఏ–1 నిందితుడు పరారీలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు.