
అప్పుల బాధతో ఆత్మహత్య
టేకులపల్లి: అనారోగ్యం, అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. టేకులపల్లి ఎస్‌ఐ ఎ.రాజేందర్ కథనం ప్రకారం... మండలంలోని బావోజీతండాకు చెందిన భూక్య లాలు(35) కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. ఇటీవల శస్త్రచికిత్స నిర్వహించగా రూ.4 లక్షల అప్పు అయింది. దీనికితోడు పంటలు కూడా సరిగా పండలేదు. దీంతో అప్పులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది సోమవారం తెల్లవారు జామున పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
గడ్డి మందు తాగి ఒకరు..
ఇల్లెందు: మండలంలోని రొంపేడు గ్రామానికి చెందిన జి. భద్రూ(55) సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ హసీనా కథనం ప్రకారం.. భద్రూ మద్యం బానిసగా మారడంతో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. దీంతో మద్యం మత్తులో ఉన్న ఆయన ఇంట్లో గడియ వేసుకుని పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
వేధింపుల కేసు నమోదు
చండ్రుగొండ: వివాహితను అదనపు కట్నం కోసం వేధించిన ఘటనలో భర్త, అత్తలపై సోమవారం పోలీసులు కేసు నమోౖదు చేశారు. ఎస్‌ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. మండల పరిధిలోని టేకులబంజర గ్రామానికి చెందిన సోనుకు టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లికి చెందిన వీరన్నతో గతేడాది వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్న కానుకలిచ్చారు. కాగా అదనపు కట్నం తేవాలని సోనును భర్త వీరన్న, అత్త లక్ష్మి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త, అత్తలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.