ఎన్నాళ్లకు మోక్షం.. | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకు మోక్షం..

Published Wed, Apr 23 2025 7:49 AM | Last Updated on Wed, Apr 23 2025 8:59 AM

ఎన్నా

ఎన్నాళ్లకు మోక్షం..

● సెర్ప్‌ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ● పదేళ్లుగా ఉద్యోగుల నిరీక్షణ ● ఉమ్మడి జిల్లాలో 335 మంది ఉద్యోగులు ● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

చుంచుపల్లి: దశాబ్దకాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న సెర్ప్‌ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో 335 మందికి బదిలీ అయ్యే అవకాశం ఏర్పడింది. బదిలీల ప్రక్రియ పూర్తయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కేడర్లలో కొత్తవారు రానున్నారు. గతేడాది జూలైలో జరిపిన సాధారణ బదిలీల్లో తమకు అవకాశం కల్పించాలని సెర్ప్‌ ఉద్యోగులు కోరినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ వర్తింపజేయటం లేదంటూ కొన్నేళ్లుగా వాపోతున్నారు. పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వీరి బదిలీల విషయం ఊసెత్తకపోవడంతో కొందరు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సెర్ప్‌ పరిధిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఏళ్లుగా ఒకే కేడర్‌లో పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2023 నుంచి సెర్ప్‌ సిబ్బందికి పే–స్కేల్‌ విధానం ద్వారా వేతనాలు చెల్లిస్తోంది. వీరిలో ఎంఎస్‌ సీసీ నుంచి డీపీఎం స్థాయివరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. సెర్ప్‌ ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల విషయంలో యూనియన్‌ నాయకులు సంబంధిత శాఖ మంత్రులతో గతంలోనూ అనేక దఫాలుగా చర్చలు జరిపారు. ఎట్టకేలకు ప్రభుత్వం సెర్ప్‌ ఉద్యోగుల బదిలీలకు ముందుకురావడంతో వారి పదేళ్ల నిరీక్షణకు త్వరలో తెర పడనుంది.

335 మందికి అవకాశం

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, వారికి ఉపాధి కల్పనలో ఆర్థిక తోడ్పాటును అందిస్తున్న సెర్ప్‌ ఉద్యోగులు దాదాపు 23 ఏళ్లుగా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. సెర్ప్‌ పరిధిలో మినిస్టీరియల్‌, ఫీల్డ్‌ సిబ్బంది, అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్లు, డిస్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్లు, కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు వివిధ హోదాలో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అన్ని కేడర్లకు సంబంధించి 335 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 156 మంది, ఖమ్మం జిల్లా పరిధిలో 179 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని సెర్ప్‌ ఉద్యోగులకు ప్రతి నెలా రూ.1.30 కోట్ల మేర వేతనాల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2000లో ‘వెలుగు’ పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాల కోసం సంస్థను పరిమిత జిల్లాల్లో ప్రారంభించారు. 2002లో ఆ ప్రాజెక్టును క్రమంగా రాష్ట్రం అంతటా విస్తరింపజేశారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పథకం పేరును పూర్తిగా ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)గా మార్చగా, 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం (సెర్ప్‌)గా తిరిగి నామకరణం చేసింది. ఇక ప్రాజెక్టు ప్రారంభమైన 2002 నుంచి ఉద్యోగులంతా కాంట్రాక్టు పద్ధతిలోనే కొనసాగుతుండగా, బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2023 ఏప్రిల్‌లో వీరి ఉద్యోగాలను క్రమబద్ధీరిస్తూ అప్పటి సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ ప్రక్రియలో పే–స్కేల్‌, ఇతరత్రా వర్తింపజేసినా.. ఇంకా అంశాలను అమలు చేయాల్సి ఉంది. గతేడాది జూలైలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని శాఖల పరిధిలో ఉద్యోగులు, సిబ్బంది బదిలీలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే పదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న సెర్ప్‌ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కొందరు ఉద్యోగులు ఆందోళన చెందారు.

ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్‌ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు ముందుకురావడం మంచి పరిణామం. ఉద్యోగులు, సిబ్బంది పదేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన చాలామంది సిబ్బంది పదేళ్లు, అంతకంటే ఎక్కువగానే ఒకేచోట పనిచేస్తున్నారు. ప్రభుత్వం 100 శాతం ఉద్యోగుల బదిలీలకు అవకాశం ఇవ్వనుండటంతో దాదాపు అందరికీ స్థానచలనం కలుగుతుందని భావిస్తున్నాం.

– డి.నీలయ్య, అదనపు డీఆర్‌డీఓ (సెర్ప్‌)

ఎన్నాళ్లకు మోక్షం.. 1
1/1

ఎన్నాళ్లకు మోక్షం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement