
నిరుపేద ఇంట్లో నిప్పుల కుంపటి
● గ్యాస్ లీకేజీ.. పక్కనే కట్టెల పొయ్యితో మంటలు ● ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి ● ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో నలుగురు
తల్లాడ: అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆ కుటుంబ సభ్యుల్లో అంతులేని విషాదం నెలకొంది. ఇంట్లోని పిల్లలే కాక వేసవి సెలవులకు వచ్చిన సోదరి పిల్లలు సైతం అగ్నిప్రమాదంలో చిక్కుకోవడం.. ఇద్దరు మృతి చెందగా, ఇంకో నలుగురు చికిత్స పొందుతుండడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. తల్లాడ మండలం మిట్టపల్లిలో జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి.
సిలిండర్ మారుస్తుండగా...
మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్ ఇంట్లో సోమవారం రాత్రి గ్యాస్ సిలిండర్ అయిపోయింది. దీంతో మరో సిలిండర్ తీసుకొచ్చిన ఆయన రెగ్యులేటర్ బిగిస్తున్నాడు. ఈక్రమాన సిలిండర్ మూత తీయగానే గ్యాస్ లీకేజీ కావడం.. సమీపాన కట్టెల పొయ్యి వెలుగుతుండడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలు వంట గదిలో నుంచి వరండాలోకి వచ్చాయి. అక్కడ వినోద్ కవల కుమారులైన వరుణ్‌తేజ్, తరుణ్‌తేజ్(7), నాయనమ్మ సుశీల(65), వేసవి సెలవుల్లో మేనమామ అయిన వినోద్ ఇంటికి వచ్చిన సత్తుపల్లి మండలం నాచారానికి చెందిన ఆయన చెల్లెలు లావణ్య పిల్లలు ప్రిన్సీ, లింసీ ఉన్నారు. దీంతో వారందరినీ మంటలు చుట్టుముట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో వినోద్ కూడా గాయపడగా.. ఆయన భార్య రేవతి సరుకుల కోసం సమీప షాప్‌నకు వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడింది. మంటలను గుర్తించిన స్థానికులు హుటాహుటిన చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత తరుణ్ తేజ్, ప్రిన్సీని హైదరాబాద్ తరలించగా.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తరుణ్, ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుశీల మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. క్షతగాత్రుల్లో వినోద్, వరుణ్, లింసీ ఖమ్మంలో, ప్రిన్సీ హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆర్తనాదాలు
గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో గాయపడిన వారు ఆర్తనాదాలు చేశారు. ఒళ్లంతా కాలిపోయి చర్మం ఊడుతుండగా ఆస్పత్రికి తరలించే సమయాన చిన్నారులు బాధ తట్టుకోలేక తమను కాపాడాలని వేడుకోవడం స్థానికులను కలిచివేసింది. అయితే, గ్యాస్ సిలిండర్ అయిపోగానే కట్టెల పొయ్యి అంటించడం.. అది మండుతుండగానే కొత్త సిలిండర్ అమర్చే క్రమాన లీకేజీతో ప్రమాదం జరిగింది. ఒకవేళ కట్టెల పొయ్యి లేకపోతే ప్రమాదం జరగకపోయేదని స్థానికులు తెలిపారు.
నిరుపేద కుటుంబం
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబానికి చెందిన వినోద్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించేవాడు. కొన్నాళ్లుగా సుతారి పనులకు వెళ్తున్నాడు. ఆయనకు ఇద్దరు కవల కుమారులు ఉండగా, వేసవి సెలవులు కావడంతో సోదరి లావణ్య పిల్లలైన ప్రిన్సీ, లింప్సీ కూడా వచ్చారు. ప్రస్తుతం వినోద్, ప్రిన్సీ, లింప్సీ, వరుణ్, వినోద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం.. వినోద్ నాయనమ్మ, కుమారుడు మృతి చెందడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, వినోద్‌కు ఆయన కుమారుడు, నాయనమ్మ మృతి విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖమ్మంలో చికిత్స పొందుతున్న వినోద్‌ను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి పరామర్శించి వైద్యులతో మాట్లాడారు.

నిరుపేద ఇంట్లో నిప్పుల కుంపటి

నిరుపేద ఇంట్లో నిప్పుల కుంపటి