
లక్ష్యం వైపు పయనం..
● ఈ ఏడాది రూ.145 కోట్ల వ్యాపారమే లక్ష్యంగా జీసీసీ కార్యాచరణ ● గిరిజనుల నుంచి ఉత్పత్తుల సేకరణ ● సేల్స్‌మెన్లకు దిశానిర్దేశం చేసిన అధికారులు
ఇల్లెందు: అటవీ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెంచినా వాటి ద్వారా ఆదాయం మాత్రం ఆశించినంత రావడం లేదు. నిత్యాసర సరుకుల విక్రయం, అటవీ ఉత్పత్తుల సేకరణ, వాటిని విక్రయించి లాభాలు ఆర్జించటం లేదు. దీంతో జీసీసీ లక్ష్య సాధనలో విఫలమవుతోంది. కానీ, ఈ దఫా గ్రామస్థాయి నుంచి అధికారుల స్థాయి వరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, సమష్టి కృషితో పనిచేసి సంస్థను బలోపేతం చేసేందుకు నిర్ణయించింది. అటవీ ఉత్పుత్తుల సేకరణతో పాటు మంచి ధరలకు నిత్యావసర వస్తువులను విక్రయించాలనుకుంటున్నారు.
డివిజన్ లక్ష్యం ఇలా..
ఇటీవల భద్రాచలంలో జరిగిన జీసీసీ డివిజనల్ స్థాయి సమావేశంలో చర్చించిన అంశాలను కిందిస్థాయికి తీసుకెళ్లాలని సూచించగా బ్రాంచ్ స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించారు. ఇల్లెందు బ్రాంచ్‌లో రూ.64.70 కోట్లు, భద్రాచలం రూ.21.88 కోట్లు, దమ్మపేట రూ.39.89 కోట్లు, పాల్వంచ రూ.17.60 కోట్లు, మణుగూరు రూ.18.85 కోట్ల వ్యాపారం చేయాలని, మొత్తంగా భద్రాచలం డివిజన్‌లో 2025–26లో రూ.145 కోట్ల వ్యాపారం చేయాలని నిర్ణయించారు. గిరిజనుల నుంచి సేకరించిన ఫల ఉత్పత్తుల విక్రయం, డీఆర్ డిపోల ద్వారా బియ్యంతో పాటు నిత్యావసరాలు విక్రయించడంతోపాటు అటవీ ఉత్పత్తులు కరక్కాయ, చిల్ల గింజలు, కుంకుడు కాయ, ఇప్పపువ్వు, ఇప్పబద్ధ, ముష్టిగింజలు, నరమామిడి చెక్క, జిగురు సేకరణపై దృష్టిసారించటమే లక్ష్యం.
అటవీ ఉత్పత్తులే కీలకం..
జీసీసీ డీఆర్ డిపోల ద్వారా ముష్టిగింజలు కిలో ధర రూ.75 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. డివిజన్ పరిధిలో భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, దమ్మపేట బ్రాంచ్‌ల్లో 149 డీఆర్ డిపోలున్నాయి. ఇల్లెందు బ్రాంచ్ పరిధిలోని గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, బయ్యారం, మణుగూరు బ్రాంచ్ పరిధిలో పినపాక, పాల్వంచ, దమ్మపేట మండలాల్లో ఈ దఫా సుమారు 3 వేల క్వింటాళ్ల ముష్టిగింజలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సంస్థ వ్యాపార లక్ష్యం..
డివిజన్‌లో వ్యాపార లక్ష్యం రూ.145 కోట్లు కాగా అటవీ ఉత్పత్తుల కొనుగోలుతో రూ.3.50 కోట్లు, వ్యవసాయేతర ఉత్పత్తుల ద్వారా రూ.30 కోట్ల వ్యాపారం, పెట్రోల్‌బంక్‌ల ద్వారా రూ.80 కోట్ల వ్యాపారం చేయనున్నారు. హాస్టళ్లు, ఆశ్రమ పాఠఽశాలలకు బియ్యం సరఫరాతో రూ.50 లక్షలు, కాస్మొటిక్స్ సరఫరాతో రూ.23.50 కోట్లు, గ్యాస్ సరఫరాతో రూ.2 కోట్లు, ఇతర వస్తువుల సేల్స్‌తో రూ.5.50 కోట్లు లక్ష్యంగా జీసీసీ ఎంచుకుంది.
లక్ష్యం దిశగా కృషి సాగుతోంది..
ఈ దఫా డివిజన్ పరిధిలో లక్ష్యం దిశగా వ్యాపారాభివృద్ధి కోసం కృషి చేయాలని పట్టుదలతో ఉన్నాం. ఇప్పటికే ఒక దఫా సమావేశం నిర్వహించాం. మరోమారు సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ దఫా రూ.145 కోట్లు లక్ష్యంగా డివిజన్‌లో జీసీసీ కార్యాచరణ ఉంటుంది.
–కె.సమ్మయ్య, డీఎం, భద్రాచలం, డివిజన్

లక్ష్యం వైపు పయనం..